- నలుగురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకం
- ఇక రిజిస్ట్రేషన్, ఇతర ఫార్మాలిటీస్‌కు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మూడో డిస్కమ్‌కు ‘రైతు డిస్కమ్’ అని పేరు ఖరారు చేసింది. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఆర్పీడీసీఎల్)’ గా పేరు పెట్టింది. రాష్ట్రంలో ఉన్న రెండు డిస్కమ్‌లకు అదనంగా మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తూ గతేడాది డిసెంబర్ 17న ప్రభుత్వం జీవో జారీ చేసి, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీకే దీని సీఎండీగా బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఈ డిస్కమ్పేరు ప్రకటించడంతో పాటు నలుగురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించింది. విద్యుత్ శాఖ కంపెనీల చట్టం ప్రకారం ఒక్కోటి రూ.10 ముఖవిలువతో రూ.5 కోట్ల విలువైన షేర్లను ప్రకటించింది. రాష్ట్ర గవర్నర్ పేరుతో 49,99,993 షేర్లు, మరో ఏడుగురు ఉన్నతాధికారుల పేరుతో 7 షేర్లను కేటాయించింది. డిస్కమ్విధివిధానాలను తెలియజేస్తూ జీవో ఇచ్చింది. రిజిస్ట్రేషన్, ఇతర ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడమే మిగిలింది.
రైతుల కోసం ప్రత్యేక డిస్కమ్
రాష్ట్రంలో ఎస్‌పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్పరిధిలో 29 లక్షలకు పైగా ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం వాటికి నిరంతరం కరెంట్సరఫరా చేస్తున్నది. ఈ ఉచిత విద్యుత్కనెక్షన్లన్నింటినీ బుధవారం అధికారికంగా రైతు డిస్కమ్‌లోకి మార్చినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన లిఫ్ట్ ఇరిగేషన్ కరెంట్కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్, సీవరేజ్ బోర్డు పరిధిలోని కనెక్షన్లు, ఎల్టీ 6బీ పరిధిలోని మున్సిపల్వాటర్కనెక్షన్లు అన్నీ ఈ డిస్కమ్ పరిధిలోకే తీసుకొచ్చారు. ఈ కొత్త డిస్కమ్ద్వారా విద్యుత్ సరఫరా, పంపిణీ, కొనుగోలు, అమ్మకం, దిగుమతి, ఎగుమతి, వీలింగ్, విద్యుత్ శక్తి వ్యాపారం, పంపిణీ వ్యవస్థ నిర్వహణ, సుంకాల ఖరారు, బిల్లింగ్, వాటి సేకరణకు వినియోగదారులు, ఇతర కంపెనీల నుంచి వ్యాపారాన్ని కొనసాగించే ఒప్పందాలను కుదుర్చుకోవడం ఈజీ అవుతుంది. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొన్నది.
నలుగురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు
‘రైతు డిస్కమ్’కు నలుగురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఎస్‌పీడీసీఎల్ సీఎండీగా ఉన్న సీనియర్ ఆఫీసర్ ముషారఫ్ అలీ ఫారూఖీని రైతు డిస్కమ్ సీఎండీగా ఇదివరకే ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో డైరెక్టర్లుగా పనిచేస్తున్న వి. తిరుపతి రెడ్డి, పి. కృష్ణ రెడ్డి, వి. మోహన్ రావు, డా. ఎన్. నరసింహులు ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా నియమించింది. అలాగే, రైతు డిస్కమ్ నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని డిప్యూటేషన్, ప్రత్యక్ష నియామకాలు లేదా అవుట్‌సోర్సింగ్ విధానం ద్వారా సమకూర్చుకునేలా ప్రభుత్వం ఆర్డర్స్ఇచ్చింది. అవసరాన్ని బట్టి బోర్డు డైరెక్టర్లను మార్చే అధికారం ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
రైతు డిస్కమ్ విధివిధానాలు ఇవీ..
కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్ విధి విధానాలను విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రకటించారు. హైదరాబాద్ మింట్‌కాంపౌండ్ ఏరియాలోని టీజీఎస్పీడీసీఎల్కార్యాలయం ప్రాంగణంలోని బీ బ్లాక్‌లో రైతు డిస్కమ్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఉన్నట్టు తెలిపారు.‘కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, ఉన్న కనెక్షన్ల నిర్వహణ, కేటాయించిన పీపీఏ వాటా ప్రకారం విద్యుత్ కొనుగోలు, డీటీఆర్‌ఎస్, మెయింటనెన్స్, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, హైదరాబాద్ వాటర్ బోర్డ్, మున్సిపల్ వాటర్కనెక్షన్ల డీటీఆర్ మీటరింగ్, నిర్వహణ, రెగ్యులేటరీ ఫైలింగ్ చేయడం, నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడం’ వంటి పనులను చేపడుతోందని నవీన్ మిట్టల్ ప్రకటించారు.
ప్రభుత్వ జీవో ప్రకారం రైతు డిస్కమ్‌లోకి మారిన విద్యుత్ కనెక్షన్ల పట్టిక
వ్యవసాయ ఉచిత విద్యుత్
కనెక్షన్లు: 29,05,779
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు
(ఎల్ఐఎస్) కనెక్షన్లు: 489
హైదరాబాద్ జలమండలి కనెక్షన్లు: 99
మిషన్ భగీరథ కనెక్షన్లు: 1,132
మున్సిపాలిటీల పరిధిలోని ప్రత్యేక డీటీఆర్‌ల నీటి కనెక్షన్లు: 639
