గోవధ జరగకుండా చూడండి..హైకోర్టు

గోవధ జరగకుండా చూడండి..హైకోర్టు
  • సీఎస్​, డీజీపీకి హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: బక్రీద్‌‌ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా గోవధ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గోవధ నిషేధ, జంతు సంరక్షణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని  ఆదేశించింది. ప్రత్యేకంగా 5, 6 సెక్షన్లను కఠినంగా అమలు చేయాలని తెలిపింది. చట్ట వ్యతిరేకంగా గోవధకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని, చట్టం అమలు చేసిన తీరుపై నివేదిక సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఆగస్టు 2కు వాయిదా వేస్తూ చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌భూయాన్, జస్టిస్‌‌ తుకారాంజీతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌ జనరల్‌‌ బి.ఎస్‌‌. ప్రసాద్‌‌ వాదనలు వినిపిస్తూ చట్ట విరుద్ధంగా గోవధ, రవాణా చేయకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, 18 చోట్ల చెక్‌‌పోస్ట్‌‌లను ఏర్పాటు చేశారని చెప్పారు. 

అక్రమ రవాణాను అడ్డుకోవడానికి 24 గంటలూ విధులు నిర్వహించేలా అదనపు పోలీసు కమిషనర్‌‌ ఈ నెల15న సర్క్యులర్‌‌ ఇచ్చారని తెలిపారు. పిటిషనర్‌‌ లాయర్‌‌ నరసింహారావు వాదిస్తూ, 2018లో ఇదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఒకే ఏడాది అమలయ్యాయని చెప్పారు. దీంతో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లా అండ్‌‌ ఆర్డర్‌‌ సమస్య రాకుండా డీజీపీ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. బక్రీద్‌‌ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ముస్లిం పెద్దలను అభ్యర్థిస్తున్నామని, ఇంతకుమించి ఎక్కువ చెప్పలేమని కామెంట్ చేసింది.