
బషీర్బాగ్, వెలుగు: ఉద్యాన శాఖను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని ఆ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుడిమళ్ల సందీప్ కుమార్, కోశాధికారి జలంధర్ విజ్ఞప్తి చేశారు. సెక్రటేరియెట్లోని తన చాంబర్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సోమవారం వారు కలిశారు. 1982లో వ్యవసాయ శాఖ నుంచి ఉద్యాన శాఖ వేరైనప్పుడు ఎన్ని ఉద్యాన అధికారుల(హెచ్ఓ) పోస్టులు ఉన్నాయో, ఇప్పటికీ అవే సంఖ్యలో పోస్టులు ఉన్నాయన్నారు.
ఒక్కో ఉద్యాన అధికారి 5 నుంచి 10 మండలాలు తిరగాలని, కేవలం క్షేత్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. సిబ్బంది ఉంటే కూరగాయలు, పండ్ల తోటలు, పామాయిల్ పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యాన శాఖ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.