రూ.2.54 కోట్ల సొంత నిధులతో మంత్రి పొన్నం వినూత్న ప్రయోగం
80 వేల మంది మహిళలకు లబ్ధి..
319 హోటళ్లలో స్టీల్ గ్లాసుల వినియోగం
సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు:
ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ సమస్య. నిషేధాలు, జరిమానాలు ఒక్కటే దీనికి శాశ్వత పరిష్కారం కావు. ప్రజలకు అందుబాటులో ఉండే సరైన ప్రత్యామ్నాయం కల్పిస్తేనే నిజమైన మార్పు సాధ్యమవుతుంది.. ఇదే విషయాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ‘స్టీల్ బ్యాంక్’
ఆచరణలో నిరూపించింది. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం నేడు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచింది. ‘హుస్నాబాద్ మోడల్’ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తే ‘ప్లాస్టిక్ రహిత తెలంగాణ’ లక్ష్యం మరింత త్వరగా నెరవేరుతుంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన తండ్రి దివంగత సత్తయ్య జ్ఞాపకార్థం ‘పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రూ.2.54 కోట్ల సొంత నిధులతో ఈ వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ మాజీ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కోహెడలో ప్రారంభమైన ఈ ఉద్యమం.. ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గమంతా విస్తరించింది.
గ్రామగ్రామాన స్టీల్ పాత్రల సేవలు
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు మండలాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 276 గ్రామ సంఘాలకు 300 నుంచి 500 మందికి సరిపడే 13 రకాల స్టీల్ పాత్రల సెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలు, వేడుకల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా ఈ పాత్రలనే వినియోగిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 7,376 స్వయం సహాయక సంఘాల్లోని 80,633 మంది మహిళలు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారు. గ్రామ సంఘాలే స్టీల్ బ్యాంక్‌లను నిర్వహిస్తూ తక్కువ అద్దెకు పాత్రలు అందిస్తున్నాయి. అద్దె కేవలం రూ.500 మాత్రమే వసూలు చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గడమే కాకుండా, మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కూడా సమకూరుతోంది.
హోటళ్లలోనూ ప్లాస్టిక్‌కు గుడ్‌బై...
ఈ ఉద్యమం కేవలం శుభకార్యాలకే పరిమితం కాలేదు. నియోజకవర్గంలోని 319 హోటళ్లు, టీ దుకాణాలకు 33,900 స్టీల్ గ్లాసులను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో పేపర్, ప్లాస్టిక్ కప్పుల స్థానంలో స్టీల్ గ్లాసుల వినియోగం పెరిగింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ స్టీల్ బ్యాంక్ ఉద్యమం ఒక విప్లవాత్మక అడుగుగా నిలిచింది. తన నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ స్టీల్ బ్యాంక్ ను
ప్రారంభించారు.
వెచ్చించిన మొత్తం నిధులు
రూ. 2.54 కోట్లు (సొంత నిధులు)
లబ్ధి పొందిన గ్రామ సంఘాలు
(వీవో/ఏఎల్ఎఫ్):276
స్వయం సహాయక సంఘాలు
(ఎస్ హెచ్ జీ):7,376
లబ్ధి పొందిన మొత్తం మహిళలు :
80,633 మంది
అందించిన పాత్రల సెట్లు : 300, 400, 500 మందికి సరిపడే 13 రకాల స్టీల్ పాత్రలు
స్టీల్ గ్లాసులు పొందిన హోటళ్లు/టీ కొట్లు: 319
పంపిణీ చేసిన స్టీల్ గ్లాసులు :33,900
అద్దె రూపంలో ఆదాయం వస్తుంది
రూ.500 కే సామాన్లు ఇస్తుండటంతో గ్రామస్తులకు డబ్బులు ఆదా అవుతున్నాయి. అటు ప్లాస్టిక్ వాడకం తగ్గి మా గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ఇటు అద్దె రూపంలో మా సంఘాలకు ఆదాయం కూడా వస్తోంది.-కొమ్మిడి శారద, కోహెడ మండల సమాఖ్య అధ్యక్షురాలు
సంఘాలకు ఎంతో ఉపయోగం
గతంలో ఊరిలో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా వేల రూపాయలు ఖర్చు చేసి బయటి నుంచి ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, సామాన్లు అద్దెకు తెచ్చుకునేవాళ్లం. దాంతో చెత్త పెరిగి ఊరంతా ప్లాస్టిక్ కాలుష్యం అయ్యేది. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అందించిన స్టీల్ బ్యాంక్ పాత్రలతో మా గ్రామ సంఘాలకు ఎంతో ఉపయోగం జరుగుతోంది.
-కొయ్యడ శ్రీలత, హుస్నాబాద్ మండల సమాఖ్య అధ్యక్షురాలు
