
పెండ్లిండ్ల కాలం వచ్చేసింది. మాఘమాసం జొరబడ్డది. ఇండ్లల్ల పెండ్లి సందడి మొదలైంది. ఒకటా.. రెండా.. ఈ ఒక్క నెలలోనే రాష్ట్రంలో లక్షకు పైగా పెండ్లిండ్లు జరగబోతున్నాయి. రెండు నెలల మూఢాలు పోయి శుభముహూర్తాలు ఎంటరవడంతో శుభకార్యాలు షురూ చేశారు జనం. పెండ్లిండ్లే కాదు గృహప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి వాటికి మంచి టైం ఫిక్స్ చేసుకుంటున్నారు. ఫంక్షన్లతో పాటు వాటి అనుబంధ వ్యాపారాలూ జోరందుకున్నాయి. ఫంక్షన్ హాళ్లు ముందుగానే బుక్కయ్యాయి. ఈవెంట్ మేనేజర్లు, పురోహితులకు చేతినిండా పని దొరికింది. బంగారం, బట్టల దుకాణాల్లో అమ్మకాలు జోరందుకున్నాయి.
ఈ నెల 25న మాఘమాసం ప్రారంభమైంది. మూఢాలతో రెండు నెలలుగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలేవీ జరగలేదు. ఇప్పుడు సీజన్ మొదలవడంతో లక్షకు పైగా జంటలు మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. ఫిబ్రవరి 2, 4, 5, 6, 7, 8, 11, 12, 26, 27, 29 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని పురోహితులు చెబుతున్నారు. 6, 29వ తేదీల్లో బ్రహ్మాండమైన ముహూర్తాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మొదలయ్యే ఫాల్గుణ మాసంలోనూ పెళ్లిళ్లు ఎక్కువే ఉన్నాయని అంటున్నారు.
వ్యాపారం ఫుల్ జోష్
శుభకార్యాలకు అనుబంధంగా ఉన్న వ్యాపారాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. వివాహాల్లో కల్యాణ మండపం నుంచి పూజారి వరకు, శుభలేఖల నుంచి వంట వరకు మస్తు గిరాకీ వస్తోంది. మంచి ముహుర్తాలున్న రోజైతే నిర్వాహకులు మామూలు ధరకన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఒకే రోజు ఒక్కో పురోహితుడు 3 పెళ్లిళ్లు జరిపించేలా అడ్జస్ట్ చేసుకుంటున్నారు. కొందరు ప్రధాన పురోహితులు ముఖ్యమైన ఘట్టం మాత్రమే దగ్గరుండి నిర్వహించి, మిగిలిన కార్యక్రమం సహాయకులు చూసుకునేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఫంక్షన్ హాళ్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. హైదరాబాద్‌తోపాటు ప్రధాన పట్టణాల్లో ఏసీ, నాన్ ఏసీ ఫంక్షన్ హాళ్లు ఎక్కువ రేటు పలుకుతున్నాయి. ఒక్కో చోట ఒక్కో రేటు తీసుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలు, డెకరేషన్స్, పెళ్లి పందిరి, టెంట్‌హౌస్, సౌండ్స్, పెళ్లి బాజాలు, వంటవాళ్లు, క్యాటరింగ్, పూలు, కూరగాయల వ్యాపారాలకు డిమాండ్ పెరిగింది.
ఈవెంట్ ఆర్గనైజర్స్కు గిరాకీ
గతంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేయాలంటే వారం, పది రోజుల పాటు ఇంట్లో హడావిడి కనిపించేది. కానీ, నేటి తరం మాత్రం రిస్క్ ఎందుకులే అనుకుంటోంది. ఈవెంట్ మేనేజర్లకు అప్పగిస్తే మొత్తం వాళ్లే చూసుకుంటారనుకుంటోంది. అందుకే ఈవెంట్ మేనేజర్లకు ఇటీవలి కాలంలో గిరాకీ ఎక్కువైంది. పెళ్లి పందిరి దగ్గర్నుంచి డెకరేషన్ దాకా, వంటల నుంచి వడ్డించే దాకా అన్ని వాళ్లే చూసుకుంటునర్నారు. దీంతో ఎక్కువ మంది యువత ఈవెంట్మేనేజర్ల వైపే చూస్తోంది.
బంగారం, వస్త్ర దుకాణాల్లో సందడి..
పెళ్లి అనగానే ముందు గుర్తొచ్చేది షాపింగ్. పెళ్లి బట్టలు, బంగారం వంటి వాటికి ఈ టైంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేయడంతో ఆయా షాపుల్లో సందడి నెలకొంది. పల్లెల్లోఉన్నోళ్లంతా ప్రధాన పట్టణాలకు చేరుకుని కొనుగోళ్లు చేస్తున్నారు. బ్రాండెడ్ ఆభరణాలు, వస్ర్తాలకే పెళ్లి కుటుంబాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర తులానికి సుమారు రూ. 42 వేలు దాటినా కొనడానికి వెనకాడటంలేదు.