తమిళనాడుకు పాకిన కేరళ స్టోరీ వివాదం.. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ హెచ్చరిక

తమిళనాడుకు పాకిన కేరళ స్టోరీ వివాదం.. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ హెచ్చరిక

ది కేరళ స్టోరీ వివాదం కేరళ నుంచి తమిళనాడుకు పాకింది. కేరళలో తీవ్ర వ్యతిరేకత రావడంతో తమిళనాడులో 'ది కేరళ స్టోరీ' చిత్రాన్ని ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వకూడదని నిఘా సంస్థ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఇంటెలిజెన్స్ ఈ హెచ్చరిక జారీ చేసినట్టు సమాచారం. గత కొన్ని రోజుల క్రితం రిలీజైన ది కేరళ స్టోరీ ట్రైలర్ లో కేరళలో మహిళలను ఐఎస్ ఉగ్రవాద సంస్థ మతమార్పిడి చేసి, విదేశాలకు తరలించినట్టు చూపించారు. ఇది యదార్థ కథ అని చిత్రబృందం పేర్కొనగా, కేరళలో ఇలాంటి ఘటనలు జరగలేదని, మత సామరస్యానికి విఘాతం కలిగించేలా సినిమా తీశారని కేరళలో నిరసన వ్యక్తమైంది.

ఈ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళలో విద్వేషం, విభజన వాదం సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా తీశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు సినిమాలోని 10 వివాదాస్పద సన్నివేశాలను తొలగించి ఇటీవలే ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

ఈ సినిమాపై కేరళలో తీవ్ర వ్యతిరేకత రావడంతో తమిళనాడులో విడుదల చేస్తే నిరసనలు తప్పవని, అందుకే సినిమాను అనుమతించవద్దని రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.