భయంకరమైన కిల్లర్‌పై ఎఫ్‌బీఐ ఆఫర్
ఢిల్లీ: కట్టుకున్న భార్యను దారుణంగా చంపేసి, నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న భద్రేష్‌కుమార్ చేతన్‌భాయ్ పటేల్అనే నేరస్థుడి కోసం అమెరికా పోలీసులతో పాటు మన పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వెతుకుతున్న టాప్ 10 నేరస్థుల్లో భద్రేష్ పేరు అందరికన్నా పైనే ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రేష్ను పట్టిచ్చిన వారికి లక్ష డాలర్ల ప్రైజ్‌మనీ అందిస్తామని ఎఫ్ బీఐ ప్రకటించింది. నేరస్థుడికి చెందిన రకరకాల ఫొటోలతో పాంపెట్లు ముద్రించి పంచడంతో పాటు, అమెరికా వ్యాప్తంగా పలుచోట్ల డిస్ ప్లే బోర్డుల్లోనూ భద్రేష్ ఫొటో పెట్టినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెప్పారు. గుజరాత్‌లోని భద్రేష్ సొంతూరులో, బంధువులు, ఫ్రెండ్స్.. ఎందరిని ప్రశ్నించినా, ఎన్నిచోట్ల వెతికినా దొరకడంలేదట. దీంతో ఎఫ్‌బీఐ ఈ ఏడు విడుదల చేసిన టాప్ టెన్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్‌లో భద్రేష్ పేరును టాప్‌లో చేర్చింది.
అమెరికాలోని మేరీలాండ్‌లో డంకిన్ డోనట్స్ స్టోర్‌లో 2015 ఏప్రిల్ 12న ఓ మర్డర్ జరిగింది. నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్న పాలక్(21) హత్యకు గురైంది. శరీరంలో చాలాచోట్ల కత్తిపోట్లతో పాలక్ మృతదేహం ఆ మరుసటి రోజు కిచెన్‌లో బయటపడింది. ముందురోజు రాత్రి భర్త భద్రేష్ కుమార్ చేతన్ భాయ్ పటేల్(24) తో విధులకు హాజరైన పాలక్.. తెల్లారేసరికి డెడ్‌బాడీగా మారడం, భద్రేష్ ఆచూకీ లేకుండా పోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్టోర్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. రాత్రి విధులు ముగించుకున్నాక, చివరగా భార్యాభర్తలు ఇద్దరూ కిచెన్‌లోకి వెళ్లడం రికార్డయింది.
ఆ తర్వాత కాసేపటికి భద్రేష్ ఒక్కడే బయటికొచ్చి, డోర్ లాక్ చేసి అసలేం జరగనట్లే కామ్‌గా వెళ్లిపోవడం గమనించారు. స్టోర్ నుంచి బయటికొచ్చిన భద్రేష్ తిన్నగా అక్కడికి దగ్గర్లోనే ఉన్న తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి, కొన్ని వస్తువులు తీసుకుని వెళ్లిపోయాడని తేలింది. ఆ తర్వాత భద్రేష్ ఓ హోటల్లో రూం తీసుకుని పడుకున్నాడని, తెల్లారిన తర్వాత ఎక్కడికి వెళ్లిపోయాడో ఎవరికీ తెలియలేదని ఎఫ్‌బీఐ అధికారులు చెప్పారు. అమెరికాలోని అన్ని సిటీల్లో గాలిస్తున్నా కనీసం చిన్న క్లూ కూడా దొరకలేదట.. ఇండియా పారిపోయి ఉంటాడనే అనుమానంతో మన పోలీసుల సాయం కోరారు. ఇక్కడి పోలీసులు నాలుగేళ్లుగా గాలిస్తూనే ఉన్నారు.

