గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ నేవీ కమాండర్ అలీరెజా తంగ్‌సిరి మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. గత వారం ఇజ్రాయెల్ జరిపిన ఒక ఆపరేషన్ లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ పరిణామం ఇరాన్ సైనిక శక్తికి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. ఎందుకంటే తంగ్‌సిరి ఇరాన్ సముద్ర తీర రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషించారు.
కమాండర్ మరణం కేవలం ఇద్దరు దేశాల మధ్య యుద్ధానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ప్రపంచ చమురు వ్యాపారంలో ఐదింట ఒక వంతు వాటా కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై ఇరాన్ పట్టు కలిగి ఉండటం ఇప్పుడు మార్కెట్లలో అలజడి సృష్టిస్తోంది. ఈ కీలక మార్గం గుండా సరఫరా నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ అండ్ నేచురల్ గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడం మొదలు కాగా చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి.
ఈ ఉద్రిక్తతల ప్రభావం కేవలం ఇంధనంపైనే కాకుండా.. సామాన్యుడిపై కూడా పడుతోంది. ఎరువుల కొరత ఏర్పడటంతో వ్యవసాయ రంగం ఆందోళనలో ఉంది. మరోవైపు యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలపై ఆంక్షలు పెరగడం, రూట్లు మారడం వంటి పరిణామాలు గ్లోబల్ ట్రావెల్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతికారంగా ఇరాన్ ఎలాంటి అడుగు వేస్తుందో అన్న భయంతో ప్రపంచ దేశాలు ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి.
