గల్ఫ్ ప్రాంతంలోని యుద్ధ పరిస్థితులు భారతీయ పారిశ్రామిక రంగాన్ని, ముఖ్యంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక భారీ 'రిలీఫ్ ప్లాన్'ను సిద్ధం చేస్తోందనే వార్తలు పారిశ్రామికవేత్తల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం, పెరిగిన రవాణా ఖర్చులతో పాటుగా సప్లై చైన్ అంతరాయాల వల్ల తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న చిన్న పరిశ్రమలకు ఊరటనిచ్చేలా 3 నుండి 6 నెలల పాటు రుణ వాయిదాల చెల్లింపుపై మారటోరియం విధించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ సీరియస్‌గా పరిశీలిస్తోందని సమాచారం.
యుద్ధం వల్ల ప్రభావితమైన ఎగుమతిదారులు, చిన్న పరిశ్రమలు తమపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మారటోరియం కావాలని ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ఆర్థిక శాఖలో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయని సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాదన పట్టాలెక్కితే.. నిర్ణీత కాలం పాటు రుణాలు తీసుకున్న వారు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇది డబ్బు లభ్యత పెరగడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి, లాభాలు తగ్గిన పరిశ్రమలకు ఇది సంజీవనిలా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
మరోవైపు.. దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత్ ఆర్థిక పునాదులు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయని భరోసా ఇచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు రూపాయి విలువ 4.1 శాతం క్షీణించి, మార్చి 30 నాటికి డాలర్‌తో పోలిస్తే రూ.95 స్థాయిలకు దిగజారింది. అయితే ఇతర వర్ధమాన దేశాల కరెన్సీలైన సౌత్ కొరియన్ వన్ (4.6%), థాయ్ బాట్ (5.5%) వంటి వాటితో పోలిస్తే రూపాయి పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని, మన విదేశీ మారక నిల్వలు బలంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.
పరిశ్రమల డిమాండ్, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం అతి త్వరలోనే ఈ మారటోరియంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో, ఎంఎస్ఎంఈలను కాపాడుకోవడం ద్వారా దేశీయ ఉపాధిని, వృద్ధిని కాపాడవచ్చని కేంద్రం భావిస్తోంది. మార్కెట్ ఒడిదుడుకులను ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
