ఎమ్మెల్సీ పదవికి బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా

పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. సోమవారం (మార్చి 30) ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మండలి ఛైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్‌కు ఈ రాజీనామాను సమర్పించారు. నితీష్ కుమార్ 2026, మార్చి 16న రాజ్య సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు సభలలో సభ్యత్వం కలిగి ఉండలేరు. ఎన్నికైన 14 రోజులలోపు ఏదో ఒక పదవిని వదులుకోవాలి. ఇందులో భాగంగానే నితీష్ కుమార్ సోమవారం (మార్చి 30) ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు. ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్ త్వరలోనే బీహార్ సీఎం పదవి కూడా రాజీనామా చేసి పూర్తిగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. 

ఎమ్మెల్యే పదవికి నితిన్ నబిన్ రాజీనామా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బంకిపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సోమవారం (మార్చి 30) అసెంబ్లీ స్పీకర్‎కు అందజేశారు. నితిన్ నబీన్ 2026, మార్చి 16న రాజ్య సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు సభలలో సభ్యత్వం కలిగి ఉండలేరు. ఎన్నికైన 14 రోజులలోపు ఏదో ఒక పదవిని వదులుకోవాలి.

 ఇందులో భాగంగానే బంకిపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు నితిన్ నబీన్ భావోద్వేగ సందేశం పంపారు. ఈ చర్య ముగింపు కాకుండా మరింత విస్తృతమైన పాత్రలో ప్రజా సేవకు కొనసాగింపు అని అభివర్ణించారు. తనకు అండగా నిలిచిన బంకిపూర్ నియోజకవర్గ ప్రజలు, బీజేపీ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ALSO READ : ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ

బీజేపీ చేతికి బీహార్ సీఎం పగ్గాలు:

రాజ్య సభకు ఎన్నికైన నితీష్ కుమార్ త్వరలోనే బీహార్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. తద్వారా ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా బీహార్‌లో తదుపరి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈసారి బీజేపీ వ్యక్తి బీహార్ సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్, విజయ్ కుమార్ సిన్హా, సంజీవ్ చౌరాసియా, నితీష్ మిశ్రా, దిలీప్ జైస్వాల్, రామ్ కృపాల్ యాదవ్, జనక్ రామ్ సీఎం రేసులో ఉన్నారు.