భువనేశ్వర్: 1960లలో చైనాతో జరిగిన యుద్ధ సమయంలో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సీఐఏ మధ్య ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ వారధిగా పని చేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో దూబే వ్యాఖ్యలపై బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఫైర్ అయ్యారు. తనపై తండ్రి బిజు పట్నాయక్‌పై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసిన ఎంపీ నిషికాంత్ దూబేను మెంటల్ డాక్టర్‌కు చూపించాలని చురకలంటిచారు.
‘‘తన తండ్రి బిజు పట్నాయక్ గురించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన దారుణమైన వ్యాఖ్యలు విని ఆశ్చర్యపోయాను. బిజు పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైనాతో పోరాడటానికి వ్యూహాలు రచించిన విషయం ఆయనకు తెలియకపోవచ్చు. నా చిన్నతనంలో చైనా దాడి విషయంలో తన తండ్రి ఎంత నిర్భయంగా ఉన్నారో దానిని తిప్పికొట్టడానికి ఆయన ఎంత చేశారో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు నిషికాంత్ దుబేకు మానసిక వైద్యుడి సహాయం అవసరమని భావిస్తున్నాను’’ అని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
నిషికాంత్ దూబే ఏమన్నారంటే..?
1960లలో చైనాతో జరిగిన యుద్ధ సమయంలో భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ సీఐఏల మధ్య అప్పటి ఒడిషా సీఎం బిజు పట్నాయక్ ఒక వారధిగా ఉన్నారని ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. నిషికాంత్ దూబే వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశభక్తుడైన బిజు పట్నాయక్‌పై నిరాధార, అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీ క్షమాపణ చెప్పాలని బీజేడీ డిమాండ్ చేసింది. బిజు పట్నాయక్‌పై వ్యాఖ్యలకు నిరసనగా దూబే నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీకి బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర రాజీనామా చేశారు.
