నిండిన నిజాంసాగర్.. నాలుగేళ్ల తర్వాత నిండుకుండలా..

నిండిన నిజాంసాగర్.. నాలుగేళ్ల తర్వాత నిండుకుండలా..
  • ఎగువ నుంచి భారీగా చేరిన వరద
  • ఆయకట్టు రైతుల్లోచిగురిస్తున్న ఆశలు
  • యాసంగికి కూడాఅందనున్న నీళ్లు

కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఎగువన భారీ వర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయగా నిజాంసాగర్ కు జలకళ వచ్చింది. దీంతో యాసంగిలో పూర్తి ఆయకట్టుకు నీళ్లు అందుతాయని రైతులు సంబుర పడుతున్నారు.

నాలుగేండ్ల తర్వాత..

ఎగువ నుంచి వరద నీరు రాక నాలుగేళ్లుగా ప్రాజెక్టు నిండలేదు. దీంతో యాసంగిలోనే కాదు.. వానాకాలంలోనూ ప్రాజెక్టు కింద పూర్తి ఆయకట్టుకు సాగునీళ్లు అందలేదు. నెల కింద రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండినప్పటికీ నిజాంసాగర్ లోకి నీళ్లు రాక వెలవెలబోయింది. ఈసారి వారం రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదిలారు. స్థానికంగానూ వర్షాలు పడడంతో గురువారం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరి నిండిం ది. 17.08 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఇన్ ఫ్లో వస్తుండటంతో ఏడు గేట్ల ద్వారా దిగువకు నీరు వదిలారు. శుక్రవారం ఇన్​ఫ్లో, అవుట్ ఫ్లో 49,504 క్యూసెక్కులు ఉంది.

యాసంగిలో డోకా లేదు

ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు 2.35 లక్షల ఎకరాలు. ఇందులో కామారెడ్డి జిల్లాలో 30వేలు, నిజామాబాద్ జిల్లాలో 2.05లక్షల ఎకరాలు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ఎత్తిపోతల ద్వారా అలీసాగర్ నుంచి సాగు నీళ్లు అందిస్తున్నారు. 90వేల ఎకరాల ఆయకట్టుకు నిజాంసాగర్ ద్వారా నీళ్లు అందించనున్నారు. నిరుడు యాసంగిలో ఆయకట్టుకు నీరు ఇవ్వలేదు. లీకేజీ నీళ్ల ద్వారా సమీపంలో ఉన్న కొద్దిపాటి ఆయకట్టు పారించారు.
ఈసారి పూర్తిగా నిండినందున 90వేల ఎకరాల ఆయాకట్టుకు నీరందనుంది. వర్ని, బాన్స్​వాడ, బీర్కుర్​, నస్రుల్లాబాద్, కోటగిరి, నిజాంసాగర్ మండలాల్లోని ఆయకట్టుకు సాగునీళ్లు వదలనున్నారు. 10 టీఎంసీ వరకు పోతే మిగిలిన నీళ్లు వచ్చే వానకాలం సీజన్ లో కూడా పంటలకు వదలవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు. రెండు సీజన్ల పంటలకు సాగునీరు అందే అవకాశం ఏర్పడటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆయా మండలాల్లో వరి నారుమళ్లు పోసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.