బీహార్ శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవడానికి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 24న బలపరీక్ష నిర్వహించనుంది. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ తో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి లాలూ సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి సహా పలువురు నేతలు హాజరయ్యారు. నితీశ్ కుమార్ బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది ఎనిమిదోసారి.
Nitish Kumar led government's floor test to prove majority in the Bihar Legislative Assembly will happen on August 24. pic.twitter.com/1p33kDvBTc
— ANI (@ANI) August 11, 2022
22 ఏండ్లలో 8వ సారి
రెండు దశాబ్దాల వ్యవధిలో నితీష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది ఎనిమిదోసారి. 2000 మార్చిలో నితీష్ తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత2005 నవంబర్‌లో, 2010 నవంబర్, 2015 ఫిబ్రవరి, 2015 నవంబర్, 2017 జులై, 2020 నవంబర్‌లలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 8 ఏండ్ల వ్యవధిలో నితీష్ 4 సార్లు సీఎంగా ప్రమాణం చేయడం విశేషం.
నితీష్ ను ఉపరాష్ట్రపతిని చేయనందునే..
తమతో తెగదెంపులు చేసుకుని ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నితీష్ కుమార్ పై బీజేపీ వరుసగా విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇప్పుడు బీజేపీ, నితీష్ సంకీర్ణ ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యలపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు.‘నితీష్ ను ఉపరాష్ట్రపతిని చేయనందునే బీజేపీతో బంధాన్ని తెంచుకున్నారు’ అంటూ సుశీల్ కుమార్ కామెంట్స్ చేశారు. సుశీల్ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని.. అసలు తాను ఉపరాష్ట్రపతి పదవి కావాలని అనుకోలేదని నితీశ్ స్పష్టం చేశారు. తమకు అలాంటి ఉద్దేశం లేదు కాబట్టే.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎన్డీయేకు మద్దతు ఇచ్చామని, ఆ విషయం మర్చిపోయారా అంటూ సెటైర్ వేశారు. ఉప రాష్ట్రపతి పదవికి నామినేట్ చేయాలని జేడీయూ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇటీవల తమను కోరారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

