నంబర్‌‌వన్‌‌లా ఆడతాం: రవిశాస్త్రి

నంబర్‌‌వన్‌‌లా ఆడతాం: రవిశాస్త్రి

హామిల్టన్‌‌: వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనలే లక్ష్యంగా న్యూజిలాండ్‌‌ సిరీస్‌‌లో నంబర్‌‌వన్‌‌ టీమ్‌‌ లెవెల్‌‌లో పెర్ఫామ్‌‌ చెయ్యాలని టార్గెట్​గా పెట్టుకున్నామని టీమిండియా హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి అన్నాడు. వచ్చే ఏడాది లార్డ్స్‌‌ వేదికగా వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్‌‌ జరగనుంది. ప్రస్తుతం చాంపియన్‌‌షిప్‌‌ పాయింట్స్‌‌ టేబుల్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌లో ఉన్న ఇండియా ఫైనల్‌‌కు అర్హత సాధించాలంటే కనీసం మరో 100 పాయింట్లు కావాలి. కివీస్‌‌(2), ఆస్ట్రేలియా(4)లో ఆడే ఆరు టెస్ట్‌‌ల్లో కనీసం రెండు గెలిస్తే ఇండియా ఫైనల్‌‌ రేస్‌‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్‌‌ టెస్ట్‌‌ సిరీస్‌‌ గురించి కోచ్‌‌ రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘లార్డ్స్‌‌లో జరిగే ఫైనల్‌‌ ఆడాలంటే మాకు ఇంకో 100 పాయింట్లు కావాలి. విదేశీ గడ్డపై ఆడే ఆరు టెస్ట్‌‌ల్లో కనీసం రెండింటిలో గెలిస్తే రేస్‌‌లో ఉంటాం. కివీస్‌‌ సిరీస్‌‌లో ఈ అంశాన్నే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతేకాక  వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌ టీమ్‌‌ అయిన మేము అదే లెవెల్‌‌లో ఆడాలని అనుకుంటున్నాం. ఎందుకంటే వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌ అనే ఫీలింగ్‌‌ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’ అని చెప్పాడు.  ఓపెనింగ్‌‌ స్లాట్‌‌గురించి మాట్లాడుతూ.. ‘ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో ఎవరుంటారనేది పక్కనబెడితే పృథ్వీ షా, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ ఇద్దరూ చాలా టాలెంటెడ్‌‌ క్రికెటర్లు. వాళ్లిద్దరూ నేషనల్‌‌ టీమ్‌‌ సభ్యులనేది నిజం. ముఖ్యంగా గిల్‌‌ చాలా పాజిటివ్‌‌ మైండ్‌‌సెట్‌‌తో బ్యాటింగ్‌‌ చేస్తాడు. వామప్‌‌ గేమ్‌‌లో ఫెయిలైనప్పటికీ గిల్‌‌, మయాంక్‌‌, పృథ్వీది ఒకటే స్కూలు. న్యూ బాల్‌‌ చాలెంజ్‌‌ను వాళ్లు ఇష్టపడతారు. అనుకోకుండా రోహిత్‌‌ టీమ్‌‌కు దూరమయ్యాడు. అందువల్ల గిల్‌‌, షాలో ఒకరు మయాంక్‌‌తో కలిసి ఫస్ట్‌‌ టెస్ట్‌‌లో ఓపెనింగ్‌‌కు వస్తారు. ఇలాంటి పోటీ ఉంటేనే జట్టు బలంగా ఉంటుంది’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.