తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

 తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది.  మే 10వ తేదీ శుక్రవారం అక్షయ తృతీయ శుభ సందర్భంగా.. భజనలు, 'హర్ హర్ మహాదేవ్' కీర్తనల మధ్య ఆలయ తలుపులను అధికారులు తెరిచారు. ఈ సందర్భంగా చాపర్లతో పూల వర్షం కురిపించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ అలయాన్ని సందర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఆలయాన్ని సందర్శించారు. తన గీతా ధామితో కలిసి కేదార్‌నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.  పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వచ్చిన భక్తులకు సీఎం పుష్కర్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. యాత్రికులు సురక్షితంగా, సంతృప్తికరంగా ప్రయాణం సాగించాలని ఆయన ఆకాంక్షించారు, గత సంవత్సరాల్లో మాదిరిగానే ఈ కార్యక్రమం ఆనందం, ఉత్సాహంతో పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, కేదార్‌నాథ్ ధామ్‌తో పాటు, యమునోత్రి ఆలయ పోర్టల్స్, యమునా నది పవిత్ర స్థలాన్ని కూడా భక్తుల కోసం తెరిచారు. గంగోత్రి ఆలయ తలుపులు మధ్యాహ్నం 12.20 గంటలకు తెరవనున్నారు అధికారులు.  భూమిపై వైకుంఠంగా (విష్ణువు నివాసం) పరిగణించబడే బద్రీనాథ్ ధామ్ మే 12వ తేదీ ఉదయం 6 గంటలకు తెరుచుకోనుంది.