వెనుక కూర్చున్నా.. హెల్మెట్ ఉండాల్సిందే

వెనుక కూర్చున్నా.. హెల్మెట్ ఉండాల్సిందే
  • రూల్స్ బ్రేక్ చేసిన టూవీలర్స్ కు ఫైన్
  • రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడ్రోజుల్లో 187 కేసులు

హైదరాబాద్, వెలుగు:  బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ ను రాచకొండ పోలీసులు అమల్లోకి తెచ్చారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ హెల్మెట్ చలానాలు విధిస్తున్నారు. డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో పాటు వెనుకసీటులో కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోతే రూ.100 స్పాట్ చలానా విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.200 కూడా ఫైన్ చేస్తున్నారు. అందుకోసం ఎల్ బీనగర్,ఉప్పల్,ఇబ్రహీంపట్నం సహా శివారు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 129 కింద బైక్ పై ట్రావెల్ చేసే వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేసేలా హైదరాబాద్,రాచకొండ,సైబరాబాద్ పోలీసులు ప్లాన్ చేశారు. అయితే రాచకొండ పరిధిలో 5 రోజుల క్రితమే ఈ కొత్త రూల్ ని అమల్లోకి తెచ్చి హెల్మెట్ పెట్టుకోని వారికి ఫైన్ లు విధిస్తున్నారు.

ఎల్ బీనగర్ లో ఎక్కువ కేసులు

రాచకొండ పోలీసులు అమల్లోకి తెచ్చిన పిలియన్ రైడర్(వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి) హెల్మెట్ రూల్ తో 9 పోలీస్ స్టేషన్ల లిమిట్స్ లో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మొత్తం 187 కేసులు నమోదు చేశారు. ఎల్ బీనగర్ లో 53 హెల్మెట్ కేసులు నమోదయ్యాయి. వెహికల్ చెకింగ్ చేస్తున్న పోలీసులు బైక్ వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోతే ఆ వెహికల్ ను ఆపి స్పాట్ చలానా విధిస్తున్నారు. రాచకొండ పరిధిలో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 750 మంది మృతి చెందారు. ఇందులో బైక్ పై వెనుక సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న 26 మంది చనిపోయారు. బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకునేలా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గత నెల అవేర్ నెస్ ప్రొగ్రామ్స్ సైతం నిర్వహించారు.

సైబరాబాద్లో ప్లాన్

రాచకొండ పోలీసుల తరహాలోనే సైబరాబాద్ పో లీసులు కూడా వెనుక సీటులో కూర్చున్న వ్యక్తులకు కూడా హెల్మెట్ రూల్ అమలు చే సేందుకు ప్లాన్  చేస్తున్నారు. ఎంవీ యాక్ట్ ప్రకా రం పిలియన్ రైడర్ కి కూడా హెల్మెట్ తప్పనిసరి అని ఉన్నప్పటికీ పోలీసులు అమలు చేయడం లేదు. 3 కమిషనరేట్ల పరిధిలో కేవలం బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి మాత్రమే హెల్మెట్ లేకుంటే చలానా విధిస్తున్నారు. అయితే ప్రతీ ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కొల్పోతున్న పిలియన్ రైడర్ల సంఖ్య పెరిగిపోవడంతో బైక్ పై వెళ్లే ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి చేయాలనే యోచనలో సైబరాబాద్,హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా తొలుత పిలియన్ రైడర్ హెల్మెట్ పై  అవేర్ నెస్ కల్పించి..ఆ తర్వాత ఈ రూల్ ని తప్పనిసరి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.