కేసీఆర్​ను గద్దె దింపడమే తెలంగాణకు అసలైన విమోచనం

కేసీఆర్​ను గద్దె దింపడమే తెలంగాణకు అసలైన విమోచనం

 

  •     అమరుల త్యాగాలను స్మరించుకుందాం
  •     ఓట్ల కోసం ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారు
  •     2023లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం
  •     ప్రజలు గర్వపడేలా విమోచన ఉత్సవాలు నిర్వహిస్తం: సంజయ్

హైదరాబాద్, వెలుగుగత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరిస్తూ.. తెలంగాణ అమరుల ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ను గద్దె దింపడమే తెలంగాణకు అసలైన విమోచనం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో నిజాం సంస్థానంలో భాగంగా ఉన్న జిల్లాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ ఉత్సవాలను అధికారికంగా జరుపుతున్నాయని.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫాం హౌస్ కే పరిమితం కావడం దురదృష్టకరమన్నారు. ఏ ప్రాంత ప్రజలకైనా వారి ఇండిపెండెన్స్ డేను జరుపుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దీనిని కాదనడానికి ఈ ముఖ్యమంత్రి ఎవరని సంజయ్ గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అరాచక నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడం కోసం అమరులైన వేలాదిమంది తెలంగాణ వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు. వారు చూపించిన తెగువ, ధైర్యసాహసాలు రాబోయే తరాలకు స్ఫూర్తిని ఇస్తాయన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరుపరంటూ అప్పటి ఆంధ్రా పాలకులను ప్రశ్నించారని.. కానీ తెలంగాణలో అధికారం చేపట్టి ఆరేండ్లు గడుస్తున్నా ఈ ఉత్సవాలను ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడం కేసీఆర్ కే దక్కిందన్నారు. వచ్చే మూడేళ్లలోనైనా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, లేకపోతే 2023లో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజలు గర్వపడేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ప్రధాని మోడీకి తెలంగాణ ప్రజల తరఫున బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పినట్లు బండి సంజయ్ చెప్పారు. మోడీ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటూ, దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.

ఘనంగా ‘విమోచన’ వేడుకలు 

బీజేపీ స్టేట్ ఆఫీసులో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్​జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పార్టీ సీనియర్ నేతలు ఇంద్రసేనారెడ్డి, మంత్రి శ్రీనివాసులు, బంగారు శృతి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు లక్ష్మణ్, రాంచందర్ రావు మాట్లాడుతూ..  మజ్లిస్ ఒత్తిడితోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ సర్కార్‌‌‌‌ నిర్వహించడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఒక తీరు, సీఎంగా మరో తీరు వ్యవహరించడం విచారకరమన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, డివిజన్, మండల స్థాయిలో కూడా పార్టీ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఘనంగా విమోచన ఉత్సవాలను జరుపుకున్నారు. పలు చోట్ల ప్రభుత్వ ఆఫీసులపై పార్టీ నాయకులు జాతీయ జెండాలను ఎగురవేశారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా విమోచన ఉత్సవాలను పార్టీ క్యాడర్ ఉత్సహంగా నిర్వహించుకుంది. బీజేపీ స్టేట్ ఆఫీసులో గురువారం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోడీ బర్త్ డేతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆలె భాస్కర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాలానగర్ లో 70 కుల వృత్తుల వారికి సన్మానం చేశారు.

చరిత్రను వక్రీకరించడం పెద్ద నేరం:సీహెచ్ విద్యాసాగర్ రావు  

చరిత్రను మరిచిపోవడమే నేరమైతే, చరిత్రను వక్రీకరించడం అంతకంటే పెద్ద నేరమని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీచ్ విద్యాసాగర్ రావు అన్నారు. ఎందరో సామాన్యుల రక్త తర్పణంతో తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని, కానీ విదేశీ భావజాలంతో మనుగడ సాగించే కొన్ని సంస్థలు ఏడు దశాబ్దాలుగా వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మార్షల్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రచురించిన ‘నిజాం వర్సెస్ నిజాం’ పుస్తకాన్ని గురువారం విద్యాసాగర్ రావు తన ఇంట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఎంఆర్ఐ అధ్యక్షుడు మురళీ మనోహర్, పుస్తక రచయిత బొప్పా భాస్కర్ పాల్గొన్నారు.