మునిసిపల్​ రిజర్వేషన్లపై పంచాయితీ

మునిసిపల్​ రిజర్వేషన్లపై పంచాయితీ
  • కోటా ఖరారు కాలేదు.. ఓటర్ల లిస్ట్​ రాలేదు
  • ఈసీ మీటింగ్​లో సైతం ఎన్నికల షెడ్యూల్​పై పార్టీల ఫైర్​
  • సమావేశం నుంచి కాంగ్రెస్​, తెలంగాణ లోక్​సత్తా వాకౌట్​
  • షెడ్యూల్​ మార్చాలని డిమాండ్​.. కుదరదన్న నాగిరెడ్డి
  • దళిత బహుజన పార్టీ ప్రతినిధిని గెంటేసిన అధికారులు

హైదరాబాద్‌‌, వెలుగు:

వార్డుల వారీగా ఓటర్ల లిస్టు రెడీ కాలేదు.. కులాల వారీగా ఓట్ల లెక్క లేదు.. రిజర్వేషన్లు ఖరారు కాలేదు..  పోలింగ్​ స్టేషన్ల లిస్టు లేదు.. ఇవేవీ లేకుండానే ఆగమేఘాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్​ ఎన్నికల షెడ్యూలు విడుదల చేయటం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ఓటరు లిస్టు, అన్ని సీట్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే ఎన్నికల షెడ్యూలు విడుదల చేయటం ఆనవాయితీ. అందుకు భిన్నంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్​ఈసీ మున్సిపోల్స్​ షెడ్యూలు జారీ చేసింది. దీంతో  నేతలందరూ షాక్​ అయ్యారు. విపక్షాలన్నీ ఇప్పటికే ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టాయి.  షెడ్యూలు మార్చాలని డిమాండ్​ చేశాయి. అదే సమయంలో ఈసీ వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. శనివారం మున్సిపల్​ ఎన్నికలపై రాజకీయ పార్టీల లీడర్లతో ఎస్ఈసీ నిర్వహించిన మీటింగ్​ రచ్చ రచ్చయింది. ఎస్ఈసీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్​, తెలంగాణ లోక్​సత్తా పార్టీ వాకౌట్ చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం చేసేలా షెడ్యూల్‌‌ ప్రకటించారని దళిత -బహుజన పార్టీ అధ్యక్షుడు కృష్ణ స్వరూప్‌‌ నిలదీశారు. మాటామాటా పెరిగింది. పోలీసులు హాల్లోకి వెళ్లి  స్వరూప్ ను  బయటకు  తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈలోగా ఒక అధికారి స్వరూప్‌‌ను బయటికి నెట్టేయటంతో గొడవ ముదిరింది.  తనపై దాడి జరిగిందని మీటింగ్‌‌ హాల్‌‌ బయట స్వరూప్‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌‌ఎస్‌‌, ఎంఐఎం మినహా మిగతా అన్ని పార్టీలు ఎన్నికల షెడ్యూల్‌‌ను తప్పుబట్టాయి.  కాంగ్రెస్‌‌, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ షెడ్యూల్‌‌ మార్చాలని డిమాండ్​ చేశారు.

మున్సిపల్‌‌ ఎన్నికల షెడ్యూల్‌‌ మార్చాల్సిందేనని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్​ చేశాయి. ఓటర్ల లిస్టు, పోలింగ్‌‌ స్టేషన్ల లిస్టు,  రిజర్వేషన్లు తేలకుండా ఎట్ల షెడ్యూల్‌‌ ఇస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌ను ప్రశ్నించాయి. మున్సిపల్‌‌ ఎన్నికల నిర్వహణపై  గుర్తింపు పొందిన, రిజిస్టర్డ్‌‌  రాజకీయ పార్టీలతో శనివారం స్టేట్‌‌ ఎలక్షన్‌‌ కమిషన్‌‌ ఆఫీస్‌‌లో కమిషనర్​ నాగిరెడ్డి సమావేశమయ్యారు. 36 పార్టీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సమావేశం  రసాభాసగా కొనసాగింది. ఎస్‌‌ఈసీ తీరును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి.  మొదట కమిషనర్‌‌ నాగిరెడ్డి ఎన్నికల షెడ్యూల్‌‌పై వివరించారు. కాంగ్రెస్‌‌, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు మున్సిపల్‌‌ ఎన్నికల షెడ్యూల్‌‌ మార్చాలని ఎన్నికల కమిషనర్‌‌ను కోరారు. ఓటర్ల జాబితా, పోలింగ్‌‌ స్టేషన్ల జాబితా, రిజర్వేషన్లు ఇంకా తేలలేదని, ఇవి పూర్తి చేసి ఆ తర్వాతే షెడ్యూల్‌‌ ఇవ్వాలన్నారు. ఇవన్నీ తేలకుండా గతంలో ఎప్పుడూ స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్​ విడుదల చేయలేదని తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కనీసం వారం రోజులైనా షెడ్యూల్‌‌ను ముందుకు జరపాల్సిందేనని పట్టుబట్టారు. దీన్ని కమిషనర్‌‌ నాగిరెడ్డి తోసిపుచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో మేడారం సమ్మక్క-–సారలమ్మ జాతర ఉండటంతో రాష్ట్రంలోని పోలీస్‌‌ ఫోర్స్‌‌ను ఎక్కువ మొత్తంలో అక్కడే మోహరించాల్సి ఉంటుందని, అందుకే జాతరలోగా మొత్తం ఎన్నికల ప్రక్రియను ముగించాలని షెడ్యూల్‌‌ విడుదల చేసినట్టు స్పష్టం చేశారు.  సమావేశంలో సీడీఎంఏ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

వాకౌట్లు.. ఉద్రిక్తత

ఎస్​ఈసీ నిర్వహించిన సమావేశం రసాభాసగా సాగింది. టీఆర్‌‌ఎస్‌‌, ఎంఐఎం మినహా మిగతా అన్ని పార్టీలు ఎన్నికల షెడ్యూల్‌‌ను తప్పుబట్టాయి. ఎస్​ఈసీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్​, తెలంగాణ లోక్​సత్తా పార్టీ నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. దళిత -బహుజన పార్టీ అధ్యక్షుడు కృష్ణ స్వరూప్‌‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం చేసేలా షెడ్యూల్‌‌ ప్రకటించారని అధికారులను నిలదీశారు. పోలీసులు మీటింగ్‌‌ హాల్‌‌లోకి వెళ్లి స్వరూప్‌‌ను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఓ అధికారి.. స్వరూప్‌‌ను బయటికి తోసుకుంటూ వచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమావేశం రచ్చరచ్చయింది. ఎస్‌‌ఈసీ​ తీరును వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

స్టార్‌‌ క్యాంపెయినర్ల ప్రచారం

గుర్తింపు పొందిన పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్  నాగిరెడ్డి తెలిపారని మీటింగ్‌‌లో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు మీడియాకు తెలిపారు. స్టార్‌‌ క్యాంపెయినర్లుగా గుర్తింపు పొందిన పార్టీలతో పాటు రిజిస్టర్డ్‌‌ పార్టీలకూ ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వాలని తాము కోరామన్నారు.

ఇలాంటి మీటింగ్​ ఎందుకు?

మేం చెప్పింది వినడానికి కమిషనర్‌ సిద్ధంగా లేరు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం తప్ప అన్ని పార్టీలు షెడ్యూల్‌ను తప్పుబట్టాయి. ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు తేలాకే నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరాం. మేం చెప్పిన సూచనలే పట్టించుకోనప్పుడు ఈ మీటింగ్‌కు మమ్మల్నెందుకు పిలువాలే. ఈ సమావేశంలో కొందరు వాడిన పదజాలంతో మనసు నొచ్చుకుంది. ఈసీ తీరుకు నిరసన వాకౌట్‌ చేశాం.- మర్రి శశిధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత

కమిషనరే వెళ్లగొట్టారు

వార్డుల రిజర్వేషన్లు తేలకుండా ఎట్ల నోటిఫికేషన్‌ ఇస్తారని ప్రశ్నించినందుకు నాపై దాడి చేశారు. నా అంగీ గల్లా పట్టి బయటకు నూకేశారు. కమిషనర్‌ నాగిరెడ్డే నన్ను బయటకు లాక్కెళ్లాలని ఆదేశించారు. అధికార పార్టీ ఏజెంట్లుగా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారు. నాపై దాడి చేసిన అధికారి, దాడి చేయాలన్న కమిషనర్‌ నాగిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు వేస్త. నా కులాన్ని ఎస్టాబ్లిష్‌ చేస్తూ తిట్టారు.- కృష్ణ స్వరూప్‌,దళిత, బహుజన పార్టీ అధ్యక్షుడు

బీసీలను అణచివేసేందుకు కుట్ర

ఎన్నికల కమిషన్‌‌ను చూస్తుంటే ఇది టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఆఫీసా అనే అనుమానం కలుగుతోంది. కమిషనర్‌‌ నాగిరెడ్డి మాట్లాడిన తీరు నియంతృత్వాన్ని తలపిస్తోంది. రిజర్వేషన్లు లేకుండా షెడ్యూల్‌‌ జారీ చేయడం అంటే బీసీలను అణగదొక్కడానికి చేసిన కుట్రలా అనిపిస్తోంది. కుట్ర పూరితంగానే బీసీ, మహిళా రిజర్వేషన్లు తగ్గించారు. ప్రభుత్వం, ఈసీ కలిసి బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్నాయి.- నాగరాజు, తెలంగాణ లోక్‌‌సత్తా పార్టీ అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఈసీ

రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్​ పనిచేస్తోంది. మున్సిపాలిటీల్లో ఎన్నికలు పెట్టకుండా ఇన్నాళ్లూ ఆగినోళ్లు ఇంకా కొన్ని రోజులు ఆగలేరా? నోటిఫికేషన్‌‌ జారీ చేసిన రోజు నుంచి ఫలితాలు ప్రకటించే వరకు మద్యం అమ్మకాలను నిలిపివేయాలి. ఇద్దరు పిల్లల నిబంధనను కొందరిని దగ్గర చేసుకునేందుకే ఎత్తివేశారు.- మనోహర్‌‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నాగిరెడ్డి నియంతలా మాట్లాడారు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ నాగిరెడ్డి నియంతలా మాట్లాడారు. కొందరు ఈ మీటింగ్‌‌కు వచ్చి చెత్త చెత్తగా మాట్లాడుతున్నారంటూ  వ్యాఖ్యానించారు. నా దగ్గర పోలీసులు లేరు.. ఉంటే మిమ్మల్ని స్టేషన్‌‌కు పంపేవాడ్ని అన్నారు. ఆయన మాట తీరులో దుందుడుకుతనం కనిపించింది. – నిరంజన్‌‌రెడ్డి, కాంగ్రెస్‌‌ నేత

ఇదో విచిత్ర అనుభవం

ఓటర్‌‌ లిస్టు, రిజర్వేషన్లు లేకుండానే మున్సిపల్‌‌ ఎన్నికల షెడ్యూల్‌‌ వచ్చింది. నా రాజకీయ జీవితంలో ఇదో విచిత్ర అనుభవం.  సంక్రాంతి పెద్ద పండుగని, వారం రోజులైనా షెడ్యూల్‌‌ ముందుకు జరపాలని కోరాం. రిజర్వేషన్లపై అభ్యంతరం చెప్పలేని దుస్థితి నెలకొంది.-రావుల చంద్రశేఖర్‌‌రెడ్డి, టీడీపీ నేత

పారదర్శకంగా జరిగే చాన్స్​ లేదు

మున్సిపల్‌‌ ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికల కమిషనర్‌‌, అధికారులు అధికార పార్టీ పక్షాన పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డ వారికీ పోటీ చేసే అవకాశం ఇచ్చారు. టీఆర్‌‌ఎస్‌‌కు సహకరించేలా ప్రక్రియ ఉంది.– బాల మల్లేశ్‌‌, సీపీఐ నేత

కొత్త వారికి ఓటు హక్కు వద్దా?

2020లో మున్సిపల్‌‌ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కొత్త ఏడాదిలో 18 ఏండ్లు నిండే వారికి ఓటు హక్కు ఇవ్వొద్దా? గతేడాది ఓటర్‌‌ లిస్టుతో హడావిడిగా ఎన్నికలు నిర్వహించడం ఏంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు నిబంధనల ప్రకారం ఇవ్వాలి.- పీఎల్‌‌ విశ్వేశ్వర్‌‌రావు, టీజేఎస్‌‌ నేత

ఆఫీసర్ల దగ్గర సమాధానమేది?

ఓటర్‌‌ లిస్టు, రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్‌‌ ప్రకటించడం ఏందని అడిగితే ఎన్నికల అధికారుల దగ్గర సమాధానం లేదు. జనగామ మున్సిపల్‌‌ కమిషన్‌‌ టీఆర్‌‌ఎస్‌‌ కార్యకర్తలా పనిచేస్తున్నారు.  – నర్సింగరావు, సీపీఎం నేత

ప్రతిపక్షాలది ఫ్రస్టేషన్​

ప్రతిపక్షాలు ఎన్నికలకు బయపడుతున్నాయి. ఆ పార్టీల నేతలు ఓటమికి ముందే కారణాలు వెదుక్కుంటున్నారు. తమ ఫ్రస్ట్రేషన్‌‌ను అధికారులపై చూపిస్తున్నారు. ఎన్నికలను ఎట్ల వాయిదా వేయించాలా అనే ధోరణితోనే సమావేశం నుంచి కాంగ్రెస్​ వాకౌట్‌‌ చేసింది.-  రామచందర్‌‌రావు, విఠల్‌‌, టీఆర్‌‌ఎస్‌‌  నేతలు

5న కోటాలు, 7న నోటిఫికేషన్​

మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లతో పాటు వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లను జనవరి 5న ప్రకటించనున్నట్లు  కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. రిజర్వేషన్లు ఖరారు చేసిన రెండురోజుల తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, మూడో రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే క్యాండిడేట్లు సంబంధిత డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడానికి ఈ టైం సరిపోతుందని పార్టీలకు నచ్చజెప్పినట్టు తెలిసింది.