ఎవరైనా చనిపోతే ఇంటి పక్కనే దహనం చేస్తున్నం

ఎవరైనా చనిపోతే  ఇంటి పక్కనే దహనం చేస్తున్నం
  • ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇండ్లల్లో సౌలత్​లు లేవు
  • మంత్రి ఉత్తమ్​కు వివరించిన మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ తమను నిండా ముంచిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు గోడు వెల్లబోసుకున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కేటాయించిన ఇండ్లలో సౌలత్​లు లేవని తెలిపారు. ఎవరైనా చనిపోతే ఇంటి పక్కనే దహన సంస్కారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. ఫ్యామిలీతో కలిసి ఆ ఇండ్లల్లో ఉండలేమన్నారు. విద్యుత్ సౌకర్యం లేదని, మంచి నీటి వసతి, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నదని వివరించారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు శుక్రవారం గాంధీభవన్​కు వచ్చారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి ఉత్తమ్​కు వినతిపత్రం అందజేశారు. ‘‘రోడ్లు, బడి, గుడి, హాస్పిటల్ ఏవీ లేవు. మల్లన్న సాగర్ కింద సుమారు 15 గ్రామాలు మునిగిపోయినయ్​. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇల్లుకు ఇల్లు.. చెట్టుకు చెట్టు.. బడికి బడి.. గుడికి గుడి.. దవాఖానాకు దవాఖానా ఇస్తామని బీఆర్ఎస్ నేతలు అన్నరు. చివరికి మోసం చేసిన్రు. మా సమస్యలు పరిష్కరించండి’’అని ఉత్తమ్​కు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు కోరారు. 

అర్హులైన వారందరికీ రేషన్, హెల్త్ కార్డులిస్తం

రేషన్, హెల్త్ కార్డుల కోసం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అర్హులైన వారందరూ రెండు కార్డుల కోసం అప్లై చేసుకోవాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలతో ఆయన మాట్లాడారు. సమస్యలపై వాళ్లు ఇచ్చిన అర్జీలు తీసుకున్నారు. మాధ్యాహ్నం 12.30 గంటలకు ఇందిరా భవన్​లో ప్రారంభమైన ప్రజాపాలన.. మధ్యాహ్నం 3.30 గంటల దాకా కొనసాగింది. మొత్తం 320 అర్జీలు వచ్చాయి. వీటిలో ఎక్కువగా రేషన్, హెల్త్ కార్డులు, పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ అర్జీలే ఉన్నాయి. కొన్ని సమస్యలపై మంత్రి అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

మరుగుజ్జులకు పీసీసీ చీఫ్ భరోసా

ఉన్నత చదువులు పూర్తి చేసిన తమకు ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలంటూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరుగుజ్జులు మంత్రి ఉత్తమ్​ను కలిసి వేడుకున్నారు. సిర్పూర్ కాగజ్​నగర్ జిల్లాలోని కాగజ్​నగర్ మండలం నాజురుల్ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఫల్గుణి మల్లిక్, పూర్ణిమా మల్లిక్, తమ్ముడు మంగళ్ మల్లిక్ గాంధీభవన్​లో మంత్రి ఉత్తమ్​ను కలిశారు. వారికి ఉపాధి కల్పిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

మరుగుజ్జులకు అండగా నిలవాలి

మరుగుజ్జులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సమాజంలో వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై ట్విటర్​లో ఆయన స్పందించారు. ‘‘మరుగుజ్జులు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయాను. నిత్యం లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. వారిలోని ధైర్యం, శక్తి నా గుండెను తాకింది. ప్రభుత్వం నుంచి వారికి న్యాయంగా, గౌరవప్రదంగా దక్కాల్సిన ప్రయోజనాల కోసం కృషి చేస్తాను. సమగ్రమైన.. శ్రద్ధగల సమాజ నిర్మాణానికి వారితో కలిసి పోరాడుతాను’’అని ట్వీట్​లో పేర్కొన్నారు.