హైదరాబాద్: నాంపల్లి ఏసీబీ కోర్టులో ఫార్ములా ఈ-రేస్ కేసుకు సంబంధించిన విచారణ ముగిసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 30కు వాయిదా వేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, కోర్టు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని చెప్పారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, తన కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రూ.లక్ష కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోందని ప్రస్తావిస్తూ.. రూ.లక్ష కోట్లు అంటున్న రేవంత్‌రెడ్డికి ఒక మాట చెప్తున్నా.. రూ.1000 కోట్లు మాకు ఇవ్వండి. రైతులకు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చొచ్చు. మహిళలకు ఇస్తామన్న తులం బంగారం కూడా ఇవ్వొచ్చు అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు పార్టీ నాయకత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15 వేల సాయం, రైతులకు బోనస్ వంటి హామీల అమలుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించలేని పరిస్థితిలో ఉందని కేటీఆర్ విమర్శించారు. విద్యుత్ సరఫరా కోసం రైతులు సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-రేస్ హైదరాబాద్‌కు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమమని కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఫార్ములా ఈ-రేస్‌ను నిర్వహించామని తెలిపారు.
పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమంపై కూడా విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఇప్పటికే రెండుసార్లు కోర్టుకు హాజరయ్యానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.
