పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) హర్జీత్ సింగ్ గుర్తుతెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఈ ప్రమాదం అమృత్‌సర్‌లోని గేట్ హకీమా పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగతావాలా ధాన్యపు మార్కెట్ సమీపంలో గురువారం తెల్లవారు జామున 2:30 గంటల మధ్య జరిగింది.
ఏఎస్ఐ హర్జీత్ సింగ్ తన మోటార్ సైకిల్‌పై రాత్రిపూట గస్తీ విధుల్లో ఉండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హర్జీత్ సింగ్ ను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఈ దాడికి తామే బాధ్యులమంటూ తెహ్రీక్-ఎ-తాలిబాన్ హిందుస్థాన్ (TTH) అనే కొత్త ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది. అయితే పంజాబ్ పోలీసులు ఈ వాదనలను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
ALSO READ : మాకు రూ.1000 కోట్లు ఇస్తే.. మా ఆస్తులన్నీ అప్పజెప్తాం
ఏఎస్ఐ హర్జీత్ సింగ్ మృతి పట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆయన కుటుంబానికి రూ.1 కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇన్సూరెన్స్ ద్వారా మరో రూ.1 కోటి రూపాయల ఆర్థిక సాయం అందుతుందని అధికారులు తెలిపారు.
ఈ దాడిపై పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
