- అపోలో హాస్పిటల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో పని చేస్తున్న జర్నలిస్టులు, ఉద్యోగులకు ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ (ఈజేహెచ్ఎస్) కింద సేవలు అందించనుంది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి (కో ఆర్డినేషన్) గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి యాజమాన్యం పాల్గొంది. ఇందులో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద ఎంపానెల్మెంట్ (నమోదు) ప్రక్రియపై చర్చించారు.
ఈ చర్చలు ఫలిచడంతో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు నగదు రహిత చికిత్స సౌకర్యాలు అందించేందుకు అపోలో యాజమాన్యంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డిల సహకారంతో గతేడాదిగా ఢిల్లీలోని వివిధ ఆస్పత్రులతో ఒప్పందానికి సంబంధించిన చర్చలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలోని అన్ని మ్యాక్స్ గ్రూప్ ఆస్పత్రులు, బీఎల్‌కే -మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఎంపానెల్మెంట్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. రాబోయే 10 రోజుల్లో జర్నలిస్టులు, ఇతర లబ్ధిదారులు ఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు.
