- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
నారాయణగూడ, వెలుగు: కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు గుర్తు చేశారు. ఆదివారం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఆడిటోరియంలో ‘ధన్వంతరి అవార్డ్స్’ కార్యక్రమం జరిగింది. ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.
ఆరోగ్య భారత్ నిర్మాణం కోసం కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. 21 ఏళ్లకే యువత ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. వయోపరిమితి నిర్ణయాధికారం కేంద్ర ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేశారు. యువతను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు, చర్యలను మానుకోవాలని సూచించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లలను చదివిస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.
సీఎంకు యువతపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని, లేకపోతే విద్యా శాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతిరెడ్డితో పాటు పలువురు వైద్యులకు రామచందర్‌రావు మెమొంటోలు
అందజేసి సత్కరించారు.
