శ్రీలంక దివాళా!

శ్రీలంక దివాళా!

   బియ్యం, పాలు,చక్కెర,పెట్రోల్​కు కొరత
    అడ్డగోలు అప్పులతోనే ఈ పరిస్థితి.. వడ్డీ చెల్లింపులకూ మళ్లీ అప్పులే
    కరిగిపోయిన డాలర్​ రిజర్వులు.. రెండేండ్లలోనే 80% పైగా ఖర్చు
    నిత్యావసరాల దిగుమతులపై ఎఫెక్ట్​
    బంకుల వద్ద బలగాలను దింపిన ప్రభుత్వం

సెంట్రల్​ డెస్క్​, వెలుగు :మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయింది శ్రీలంక పరిస్థితి. తిండికి కటకట మెల్లమెల్లగా మొదలై.. ఆర్థిక సంక్షోభంలా ముదిరిపోయింది. తిండి దగ్గర్నుంచి బండ్లలో వాడే చమురు దాకా.. రాసుకునే పేపర్​ నుంచి కరెన్సీ పేపర్​ వరకు అన్నింటికీ కొరత ఏర్పడింది. ఫలితంగా శ్రీలంక ప్రజలు తినేందుకు ఏమీ దొరక్క.. దొరికిన వాటికి ఎక్కువ రేట్లు పెట్టలేక అల్లాడిపోతున్నారు. పెట్రోల్​, కిరోసిన్​ దొరక్క లైన్లలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పేపర్​ లేక పరీక్షలు వాయిదా పడి, చదువులు మూలకుపడి స్టూడెంట్లు, యువత ఆగమైతున్నారు. గందరగోళం మధ్య అక్కడి జనాలు మన దేశానికి వలస రావడానికి ప్రయత్నిస్తున్నరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశం దివాళా తీసే దుస్థితికి వచ్చేసింది. దీనికంతటికీ కారణం డాలర్ల మూట కరిగిపోవడమే.  

దిగుమతులే బతుకు

శ్రీలంకకు దిగుమతులే బతుకు. వాటి మీదే కాలం వెళ్లదీస్తోంది. పెట్రోలియం, ఆహారం, పేపర్​, చక్కెర, పప్పులు, రవాణా పరికరాలు, మందులు, బియ్యం వంటి వాటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. కానీ, ఇప్పుడు ఆ దిగుమతులన్నీ పడిపోయాయి. వేరే దేశాల నుంచి వాటిని కొనేందుకు ‘డాలర్లు’ లేవు. దీంతో నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగాయి. కిలో బియ్యం రూ.290, కిలో చక్కెర రూ.290, 400 గ్రాముల పాలపొడి రూ.790కి చేరాయి. ఒక్కో గుడ్డు ధర రూ.10కి పెరిగింది. కిలో చికెన్​ ఇప్పటికే 3 వేల శ్రీలంక రూపాయలైంది.12.5 కిలోల గ్యాస్​ బండ అక్కడ మన కరెన్సీ ప్రకారం రూ.1,359 (శ్రీలంక రూపాయలైతే 4,199)కి పెరిగింది. రెండు నెలలకు ముందు గ్యాస్​ ధర 1900 శ్రీలంక రూపాయలే. 

స్కూల్​, కాలేజీ ఎగ్జామ్స్​ రద్దు

శ్రీలంక దిగుమతుల్లో మరో ప్రధానమైన వస్తువు పేపర్​. ఇప్పుడు ఆ పేపర్​కూ భారీగా కొరత వచ్చి పడింది. పరీక్షలను పెట్టేందుకు పేపర్​ లేక.. పరీక్షలనే ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో 45  లక్షల మంది విద్యార్థుల చదువులు గందరగోళంలో పడ్డయి. స్కూలు యజమానులు స్వయంగా పేపర్​ కొందామనుకున్నా.. డాలర్​ నిల్వలు లేక ఏం చేయాలో తెలియని 
స్థితిలో ఉండిపోతున్నారు.

అప్పులు దెబ్బకొట్టినయ్​ 

ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న అన్ని పరిస్థితులకు ఒకే ఒక్క కారణం అప్పులు. ఆదాయం లేకపోవడం, వేరే దేశాల నుంచి అప్పులు ఎక్కువగా తీస్కోవడం.. తీస్కున్న అప్పులకు ఎక్కువ వడ్డీ కట్టాల్సి రావడం వంటి కారణాలే ఆ దేశాన్ని నడిసంక్షోభంలో నిలబెట్టాయి. దానికితోడు ఆర్థిక సంస్కరణల పేరిట పన్నులు, ఎక్సైజ్​ డ్యూటీలను తగ్గించడం ఎన్నో సమస్యలకు దారితీసింది.ఇటు ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​(ఐఎంఎఫ్)​ నుంచి సాయం తీసుకోకూడదని మొండిపట్టుదలకు పోవడం, శ్రీలంక క్రెడిట్​ రేటింగ్​ను ఐఎంఎఫ్​ తగ్గించడమూ తీవ్ర పరిణామాలకు కారణమైంది. ఫలితంగా క్యాపిటల్​ మార్కెట్ల నుంచి ఇంటర్నేషనల్​ సావరిన్​ బాండ్లను (ఐఎస్బీ) తీస్కోవడానికి వీల్లేకుండాపోయింది. అప్పుల విషయంలో ఎప్పుడంటే అప్పుడు చైనా వైపే శ్రీలంక చూసింది. ఒక్క చైనాకే 500 కోట్ల డాలర్ల మేర శ్రీలంక అప్పులను చెల్లించాల్సి ఉంది. 2018లో వంద కోట్ల డాలర్లు, 2020లో 50 కోట్ల డాలర్లు, 2021 ఏప్రిల్​లో 50 కోట్ల డాలర్లు, 2021 ఆగస్టులో 200 కోట్ల డాలర్లను అప్పుగా తీసుకుంది. గతంలో చేసిన అప్పులను తిరిగి కట్టలేక కీలకమైన హంబన్​టోటా పోర్టును 2018లో 99 ఏండ్లకుగానూ చైనాకు లీజుకిచ్చేసింది. 

గండం నుంచి గట్టెక్కేందుకూ అప్పులే 

తాజాగా ఉన్న పరిస్థితులను సరిదిద్దేందుకు, గండం నుంచి గట్టెక్కేందుకూ శ్రీలంక మళ్లీ అప్పులనే నమ్ముకుంది. ఇప్పుడు కూడా చైనా మీదనే ఎక్కువగా ఆధారపడింది. మరో 250 కోట్ల డాలర్లు అప్పుగా తీసుకునేందుకు శ్రీలంక కసరత్తులు చేస్తోంది. గత నెలలోనే ఇండియా 50 కోట్ల డాలర్ల మేర సాయం అందించింది. మరో వంద కోట్ల డాలర్లు ఇచ్చేందుకూ హామీ ఇచ్చింది.

ప్రెసిడెంట్​ దిగిపోవాలంటూ దేశంలో ఆందోళనలు

ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా శ్రీలంకలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రజలు, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స పదవిలో నుంచి దిగిపోవాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను ఆయన ఆగం పట్టించారని, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడేలా చేశారని మండిపడుతున్నారు. కనీసం పాలు, మందులు కూడా దొరకని పరిస్థితికి దేశాన్ని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డాలర్లు కరిగిపోయినయ్​

1948 తర్వాత అంతటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొం టోంది. విదేశీ మారక నిల్వ లు (డాలర్లు) వేగంగా కరిగిపోయాయి. 2019లో 750 కోట్ల డాలర్లున్న ఫారిన్​ రిజర్వులు.. ఇప్పు డు వంద కోట్ల డాలర్లకు పడిపోయాయి. రెండేండ్లలోనే 80 శాతానికి పైగా రిజర్వులు అయిపోయాయి. వివిధ దేశాలకు చెల్లించాల్సి న అప్పుల వడ్డీలకే ఎక్కువ మొత్తంలో డాలర్లను ఖర్చు పెట్టేస్తుండడంతో దిగుమతుల చెల్లింపు లపై ఎఫెక్ట్​ పడింది. ఫలితంగా ద్రవ్యోల్బణం 15.1 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతా నికి ఎగబాకింది. ఫలితంగా ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం దేశంలోని మరో 5 లక్షల మంది బీపీఎల్​ కేటగిరిలోకి వచ్చేశారు.

కరోనా దెబ్బతో టూరిజం బంద్​

శ్రీలంకకు పర్యాటకం నుంచే ఎక్కువ ఆదాయం వచ్చేది. ఏటా 400 కోట్ల డాలర్లు టూరిజం నుంచి ఆమ్దానీ వచ్చేది. కానీ, 2019 ఈస్టర్​ బాంబు పేలుళ్లకు తోడు కరోనా దెబ్బకు టూరిజం బంద్​ అయిపోయింది. డాలర్లు రాక ఆదాయానికి గండి పడింది. ఇటు దేశంలో విదేశీ పెట్టుబడులు (ఎఫ్​డీఐ)ల ముచ్చట్నే లేకుండా పోయింది. ఏటికేడు ఎఫ్​డీఐలు తగ్గిపోయా యి. శ్రీలంక ప్రభుత్వ లెక్కల ప్రకారం 2018లో 160 కోట్ల డాలర్ల మేర ఎఫ్​డీఐలు రాగా.. 2019లో అది 79.3 కోట్ల డాలర్లు, 2020లో 54.8 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఫలితంగా డాలర్లకు కొరత తీవ్రమైంది. 

బంకుల ముందు బారులు

పెట్రోల్​, డీజిల్​, కిరోసిన్​ కోసం శ్రీలంక దిగుమతుల మీదనే ఎక్కువ ఆధారపడుతున్నది. అయితే, వాటిని కొనేందుకు డాలర్లు లేకపోవడంతో దిగుమతులు ఆగాయి. ముడి చమురు లేక ఆయిల్​ రిఫైనరీని ప్రభుత్వం బంద్​ పెట్టింది. ఫలితంగా పెట్రోల్​, డీజిల్​, కిరోసిన్​కు కొరత ఏర్పడింది. వాటిపై ప్రభుత్వం రేషన్​ విధించింది. జనాలు పెట్రోల్​ బంకుల బాట పట్టారు. ఈ క్రమంలోనే గంటల కొద్దీ క్యూలో నిలబడిన ముగ్గురు వృద్ధులు కుప్పకూలి కన్నుమూశారు. చమురు దొరుకుతుందో లేదో తెలియక బంకుల వద్ద జనాలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో బంకుల వద్ద కొట్లాటలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం బలగాలను రంగంలోకి దించింది. డీజిల్​ లేక కరెంట్​ సరఫరాలో రోజూ ఏడున్నర గంటలు కోత విధిస్తున్నారు. బస్సు సర్వీసులూ ఎక్కువ కాలం పాటు కొనసాగించలేమని రవాణా శాఖ చెప్పింది. 

మన దేశానికి వలస
తిండి దొరకని దుస్థితిలో శ్రీలంకలో బతక లేక ప్రజలు మన దేశానికి వలస వస్తున్నారు. మంగళవారం జాఫ్నా, మన్నార్​ నుంచి 16 మంది వచ్చారు. రెండు బ్యాచ్​లుగా వాళ్లు తమిళనాడులోని రామేశ్వరానికి చేరుకున్నా రు. తొలి బ్యాచ్​లో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు శరణార్థులుగా వచ్చారు. తీరంలో చిక్కుకుపోయిన వారిని కోస్ట్​గార్డ్స్​ కాపాడా రు. ఐదుగురు పిల్లలు సహా పది మందితో కూడిన మరో గ్రూపు సభ్యులు మంగళవారం రాత్రి రామేశ్వరం చేరుకున్నారు. వాళ్లంతా రూ.3 లక్షలకు పడవ మాట్లాడుకుని వలస వచ్చారని చెప్తున్నారు. అయితే, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ఇంకో వారంలో మరో 2 వేల మంది వచ్చే అవకాశం ఉందంటున్నారు.