అన్ని స్కీమ్‌లను అమలు చేస్తేనే రాజీనామా చేస్త : హరీశ్‌రావు

అన్ని స్కీమ్‌లను అమలు చేస్తేనే రాజీనామా చేస్త : హరీశ్‌రావు
  • బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వెల్లడి
  • రాజీనామా లేఖతో అమరవీరుల స్థూపం వద్దకు రాక

హైదరాబాద్, వెలుగు: రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను ఆగస్టు 15లోగా అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్​ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తనకు రాజకీయాలకంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ఐదేండ్లు తాను పదవిలో లేకపోయినా పర్వాలేదన్నారు. 

 ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఇటీవల సవాల్ చేసిన హరీశ్‌‌‌‌‌‌‌‌.. ఈ మేరకు శుక్రవారం ఉదయం గన్‌‌‌‌‌‌‌‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా లేఖతో వచ్చారు. అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం లేఖను అక్కడున్న రిపోర్టర్లకు అందించారు. రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారంటీలను, హామీలను పంద్రాగస్టులోగా అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని ఆ లేఖలో హరీశ్​ పేర్కొన్నారు. తన రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయనని తెలిపారు.

పింఛన్ల పెంపు, వడ్లకు, మొక్కజొన్నలకు బోనస్, రైతు బంధు, రుణమాఫీ వంటి అన్ని స్కీమ్‌‌‌‌‌‌‌‌లను అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయిస్తామని సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారని తెలిపారు. తనలాగే రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కూడా వచ్చి రాజీనామా లేఖను రిపోర్టర్లకో, మేధావులకో ఇవ్వాలని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. అమరవీరుల స్థూపం వద్దకు రావడం ఇష్టం లేకపోతే, పీఏతో రాజీనామా లేఖను పంపించాలని పేర్కొన్నారు. హరీశ్‌‌‌‌‌‌‌‌రావు వెంట ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ తదితరులు ఉన్నారు.