సీఎం సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్

సీఎం సభతో  కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
  • మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చొప్పదండిలో సీఎం పర్యటన 
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కరీంనగర్/చొప్పదండి, వెలుగు: మున్సిపల్ ఎన్నికల వేళ  చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో నిర్వహించిన ‘ప్రజాపాలన  ప్రగతి బాట’ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సభకు ఉమ్మడి జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు ఆయా మున్సిపాలిటీల నుంచి భారీగా జనం తరలివచ్చారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి  హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మధ్యాహ్నం 3.25 గంటలకు గుమ్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకోగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

బహిరంగ సభ వేదిక వద్ద రూ.45.15 కోట్లతో కరీంనగర్ జిల్లా రామడుగు వెదిర గ్రామంలో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ),  రూ.5కోట్లతో గంగాధర మండలం మధురానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

అనంతరం నిర్వహించిన సభకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షత వహించగా.. జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, మంత్రులు శ్రీధర్ బాబు,  పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, ఎంఎస్‌‌‌‌‌‌‌‌ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద హాజరయ్యారు. సభలో సీఎం చేసిన ప్రసంగంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై చేసిన విమర్శలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలను ఆలోచింపజేసింది. కార్యక్రమంలో చివరగా 2,676 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.110.10 కోట్ల చెక్కులను సీఎం పంపిణీ చేశారు. 

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటి కెనాల్స్ ఏర్పాటయ్యాయని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూసేకరణకు మిగిలిన నిధులను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.  కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సీఎంను కోరారు.  నారాయణపూర్ రిజర్వాయర్ పనులను ప్రభుత్వం సత్వరమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. ధర్మపురి కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు. 

పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ను ప్రచారానికి ఎలా పిలుస్తారు

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆంధ్రాకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందని, కొబ్బరి చెట్లు మాడిపోయాయని  తెలంగాణపై విషం చిమ్ముతున్న  పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ను బీజేపీ నాయకులు ఎలా ప్రచారానికి పిలుస్తున్నారని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులతో పొత్తు పెట్టుకున్న తెలంగాణ బీజేపీపై  ప్రజలు, ఉద్యమకారులు ఆలోచన చేయాలని సూచించారు. 

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి దీర్ఘకాలిక సమస్యలను సుసాధ్యం చేసిన ఘనత సీఎం దక్కుతుందన్నారు. కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారని, ఎస్సీల్లో వర్గీకరణ చేశారని, రైతులు, నేత కార్మికుల సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. పెండింగ్ అభివృద్ధి పనులను ప్రాధాన్యతనుబట్టి పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆరేపల్లి మోహన్, తదితరులు పాల్గొన్నారు. 

జగిత్యాల అభివృద్ధి పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్

జగిత్యాల టౌన్, వెలుగు: చొప్పదండి మండలం గూమ్లాపూర్ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి జగిత్యాల అభివృద్ధికి కీలక హామీలు ప్రకటించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులతోపాటు యావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు విస్తరణపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సందర్భంగా సభలో యావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోడ్డును విస్తరిస్తామని ప్రకటించారు. వాలంతరీ ల్యాండ్‌‌‌‌‌‌‌‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు.