- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక ఓటర్లుగా బీసీలు
- ఆయా వార్డులు, డివిజన్లలో బీసీలకే మెజార్టీ టికెట్లు కేటాయించిన పార్టీలు
- మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో బరిలో అత్యధిక పోటీదారులు బీసీలే..
మహబూబ్‌నగర్, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో దాదాపు 29.30 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో దాదాపు 51 శాతం మంది బీసీలు ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ 41.5 శాతం స్థానాలను బీసీలకు కేటాయించగా, తాజాగా జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ డెడికేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కమిషన్ మెజార్టీ స్థానాలను బీసీలకు రిజర్వ్ చేసింది. అయితే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఈ వర్గానికి కేటాయించిన స్థానాలతో పాటు అన్‌రిజర్వ్, అన్రిజర్వ్మహిళా స్థానాల్లోనూ బీసీలను పోటీకి దింపేందుకు మొగ్గు చూపాయి. దీంతో చాలా స్థానాల్లో బీసీ లీడర్లు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.
బీసీలకు సీట్ల కేటాయింపు ఇలా..
నాగర్‌కర్నూల్ మున్సిపాల్టీలో 24 వార్డులుండగా ఏడు స్థానాలు బీసీలకు, 12 స్థానాలు జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. ఇందులో జనరల్‌స్థానాల్లో కాంగ్రెస్ -ఎనిమిది మంది, బీఆర్ఎస్ తొమ్మిది మంది, బీజేపీ ఐదుగురు బీసీలకు అవకాశం కల్పించాయి. కల్వకుర్తి మున్సిపాల్టీలో 22 వార్డులుండగా బీసీలకు ఆరు, జనరల్‌కు 11 స్థానాలు రిజర్వ్ చేయగా, జనరల్ స్థానాల నుంచి బీసీలు కాంగ్రెస్ నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి నలుగురు పోటీ పడుతున్నారు.
కొల్లాపూర్ మున్సిపాల్టీలో 19 వార్డులుండగా ఐదు స్థానాలు బీసీలకు, పది స్థానాలకు జనరల్‌కు కేటాయించగా, జనరల్ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది, బీఆర్ఎస్, బీజేపీ నుంచి పది మంది చొప్పున బీసీలు పోటీ చేస్తున్నారు.
నారాయణపేట మున్సిపాల్టీలో 24 వార్డులుండగా బీసీలకు ఎనిమిది, జనరల్‌కు 12 స్థానాలు కేటాయించారు. అన్ని జనరల్ స్థానాల్లో ప్రధాన పార్టీలు బీసీలకే అవకాశం కల్పించాయి.
కోస్గిలో 16 వార్డులుండగా ఐదు బీసీలు, ఎనిమిది జనరల్‌కు కేటాయించగా, జనరల్ స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల నుంచి ఆరు మంది చొప్పున బీసీలు పోటీ చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా, బీసీలకు 23, జనరల్‌కు 30 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఇందులో కాంగ్రెస్ జనరల్ స్థానాల్లో 24 మంది బీసీలను పోటీకి దింపింది.
దేవరకద్ర మున్సిపాల్టీలో 12 వార్డులుండగా మూడు బీసీలకు, ఆరు స్థానాలకు జనరల్‌కు కేటాయించగా, జనరల్ స్థానాల్లో కాంగ్రెస్ ఐదుగురు బీసీలను, బీజేపీ నలుగురికి, బీఆర్ఎస్ ముగ్గురికి పోటీకి అవకాశం కల్పించాయి.
భూత్పూర్ మున్సిపాల్టీలో పది వార్డులుండగా రెండు బీసీలకు, ఐదు జనరల్‌కు కేటాయించారు. జనరల్ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి నలుగురు పోటీ చేస్తున్నారు.
వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులుండగా 11 స్థానాలు బీసీలకు, 17 స్థానాలు జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. ఇందులో జనరల్ స్థానాల్లోనూ ప్రధాన పార్టీలు బీసీలకు అవకాశం కల్పించాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ బీసీలు 26 మందికి, బీఆర్ఎస్ 24 మందికి, బీజేపీ 23 మందిని పోటీకి దింపింది.
కొత్తకోటలో 15 వార్డులుండగా, అందులో నాలుగు బీసీలకు, ఎనిమిది జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. ఈ స్థానాల్లో మూడు పార్టీలు తొమ్మిది మంది చొప్పున బీసీలకు అవకాశం కల్పించింది.
పెబ్బేరులో 12 వార్డులుండగా బీసీలకు రెండు, జనరల్‌కు ఆరు రిజర్వ్ కాగా, బీఆర్ఎస్ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఆరుగురు బీసీలు బరిలో నిలిచారు.
అమరచింతలో పది వార్డులుండగా బీసీలకు రెండు, జనరల్‌కు ఐదు స్థానాలు రిజర్వ్ కాగా, మూడు పార్టీలు ఐదు మంది చొప్పున బీసీలకు పోటీకి అవకాశం కల్పించాయి.
ఆత్మకూరులో పది వార్డులుండగా బీసీలకు మూడు, జనరల్‌కు ఐదు స్థానాలు కేటాయించగా, మూడు పార్టీలు ఆరు మంది చొప్పున బీసీలను రంగంలోకి దింపాయి.
గద్వాల మున్సిపాల్టీలో 37 వార్డులుండగా,13 బీసీలకు, 19 స్థానాలు జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. ఇందులో బీజేపీ 29 మందికి, కాంగ్రెస్ 23 మందికి, బీఆర్ఎస్ 22 మంది బీసీలకు పోటీకి అవకాశం కల్పించింది.
అలంపూర్‌లో పది వార్డులుండగా రెండు వార్డులు బీసీలకు, ఐదు వార్డులు జనరల్‌కు కేటాయించారు. ఈ స్థానాల నుంచి ఆయా పార్టీల తరఫున మొత్తం పది మాత్రమే బీసీలు పోటీలో ఉన్నారు.
వడ్డేపల్లి మున్సిపాల్టీలో పది వార్డులుండగా రెండు బీసీలకు, ఐదు స్థానాలకు జనరల్‌కు కేటాయించారు. ఈ మున్సిపాల్టీ నుంచి ఎన్నికల బరిలో 40 మంది క్యాండిడేట్లు పోటీ పడుతుండగా, అందులో 24 మంది బీసీలు ఉన్నారు.
అయిజ మున్సిపాల్టీలో 20 వార్డులుండగా మొత్తం 63 మంది పోటీ పడుతుండగా అందులో 27 మంది బీసీలు ఉన్నారు.
