ఒక్కడే బండి లాగిండు.. కమలం ఖాతాలో కరీంనగర్‌‌‌‌

ఒక్కడే బండి లాగిండు.. కమలం ఖాతాలో కరీంనగర్‌‌‌‌
  •     అభ్యర్థుల ఎంపిక, ప్రచారం నుంచి.. 
  • పోల్ మేనేజ్‌‌మెంట్‌‌ దాకా అన్నీ తానై నడిపించిన బండి సంజయ్‌‌
  •     66 స్థానాలకు 30 చోట్ల గెలిచిన కమలం పార్టీ 
  •     మ్యాజిక్​ ఫిగర్​కు కేవలం ఐదు అడుగుల దూరంలో ఆగిన బీజేపీ
  •     మద్దతు ఇచ్చేందుకు క్యూకట్టిన ఇండిపెండెంట్లు

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్‌‌‌‌లో కమలం వికసించింది. కార్పొరేషన్‌‌పై బీజేపీ జెండా ఎగరేసేందుకు రంగం సిద్ధమైంది. 2005లో ఈ మున్సిపల్ కార్పొరేషన్‌‌లో ఓ కార్పొరేటర్‌‌‌‌గా  ప్రస్థానం ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. అదే మున్సిపల్ కార్పొరేషన్‌‌లో ఇప్పుడు 30 మంది బీజేపీ అభ్యర్థులను ఒంటి చేత్తో గెలిపించుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం మొదలు పోల్ మేనేజ్‌‌మెంట్ దాకా తనదైన ముద్ర వేశారు. బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా స్వయంగా బండి సంజయ్ అందించారు. కొంతమంది అభ్యర్థులకు నామినేషన్ పత్రాలకు అవసరమైన డిపాజిట్ సొమ్మును కూడా  పంపించడం విశేషం.  కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీకి చేజిక్కించుకునేలా.. అభ్యర్థుల పక్షాన డివిజన్లలో పెద్ద ఎత్తున స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, సభలు నిర్వహించారు. అందుకయ్యే ఖర్చునూ బండి సంజయ్ భరించారు.  

13 సీట్ల నుంచి 30 సీట్లకు.. 

2020 మున్సిపల్ ఎన్నికల్లో  కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.  ఈ సారి 13 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలిచారు. గత ఎన్నికల్లో 33  స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్  ఈ సారి 9 స్థానాలకే పరిమితమైంది. ఎంఐఎం గత ఎన్నికల్లో ఆరు చోట్ల గెలవగా..  ఈసారి 3 స్థానాల వద్దే ఆగిపోయింది. ఆలిండియా  ఫార్వర్డ్ బ్లాక్ గతంలో మూడు చోట్ల గెలుపొందగా, ఈసారి ఇద్దరు కార్పొరేటర్లు గెలిచారు. గత పాలకవర్గంలో  13  మంది కార్పొరేటర్లను కలిగిన బీజేపీ.. ఈసారి ఏకంగా 30 చోట్ల గెలిచింది.  మ్యాజిక్ ఫిగర్‌‌కు  మరో నలుగురు కార్పొరేటర్లు అవసరం ఉండగా.. శుక్రవారం రాత్రి  13వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థినిగా విజయం సాధించిన  తెల్ల లక్ష్మి, 15 డివిజన్ ఏఐఎఫ్‌బీ అభ్యర్థినిగా విజయం సాధించిన విపల సాయి జ్యోతి.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో  చేరారు. దీంతో బీజేపీ బలం 32కు చేరింది. మరో 8 మంది ఇండిపెండెంట్లు బీజేపీ నేతల టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. వారు నేడో, రేపో బీజేపీ కండువా కప్పుకునే అవకాశముంది. దీంతో తమకు ఎక్స్ అఫీషియో ఓటు అవసరం రాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 

సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.. 

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కరీంనగర్ కార్పొరేషన్, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో బీజేపీ టికెట్లకు తీవ్ర పోటీ నెలకొన్నది. అయినా.. గెలుపోటములతో సంబంధం లేకుండా సొంత పార్టీలోనే  ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా బండి సంజయ్.. నూటికి 80 శాతం మంది నిఖార్సైన, నిబద్ధత కలిగిన కార్యకర్తలకే కార్పొరేటర్, కౌన్సిలర్ టిక్కెట్లు ఇచ్చారు. ఎన్నికలంటే గెలుపే అన్ని పార్టీలకు ప్రాతిపదిక. అందుకే తాను సొంతంగా చేయించిన సర్వేల్లో గెలవగలిగే సత్తా ఉన్నోళ్లుగా గుర్తించినవాళ్లకే మెజార్టీ టికెట్లు ఇచ్చారు.  ఆ తర్వాత వారి గెలుపు బాధ్యతలను పూర్తిగా తన భుజాన వేసుకుని ఎన్నికలను ఒంటి చేత్తో నడిపించారు. 

కేంద్రం నిధులతో చేసిన అభివృద్ధిపై బుక్‌లెట్‌

బీజేపీ అభ్యర్థుల పేరిట కరపత్రాలను కూడా  స్వయంగా బండి సంజయే ప్రింట్ చేయించి పంపించారు. అలాగే, కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి తాను ఎంతగా కృషి చేశారో తెలిసేలా  కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధి వివరాలతో బుక్‌లెట్ ను రూపొందించారు. వాటిని ఇంటింటికీ పంపిణీ చేయించి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత సైతం పోల్ మేనేజ్‌మెంట్, మరుసటి రోజు పార్టీ కార్య్రమాల నిర్వహణపై  కసరత్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న నిర్వహించిన విజయ సంకల్ప ర్యాలీ మొత్తం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి హైలెట్‌గా నిలిచింది. బండి సంజయ్ ఆ ర్యాలీతో కాషాయ శ్రేణుల్లో జోష్ నింపడంతోపాటు బీజేపీ గెలవబోతుందనే వేవ్‌ను క్రియేట్ చేయగలిగారు.

నాడు..                      నేడు.. 
పార్టీ     2 020                 2026
బీజేపీ    13                  30  
కాంగ్రెస్​   0                 13
బీఆర్ఎస్​   33           09
ఎంఐఎం    06            03
 ఫార్వర్డ్ బ్లాక్    03       02