జర్నలిస్టులు, డ్రైవర్లు, హోంగార్డుల బీమా రెన్యువల్ చేయలే

జర్నలిస్టులు, డ్రైవర్లు, హోంగార్డుల బీమా రెన్యువల్ చేయలే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సోషల్‌‌‌‌ సెక్యూరిటీ స్కీంను మరిచిపోయింది. జర్నలిస్టులు, ఆటో, క్యాబ్‌‌‌‌ డ్రైవర్లు, హోంగార్డుల కోసం తెచ్చిన రూ. 5 లక్షల ప్రమాద మరణ బీమాను రెన్యువల్ చేయలేదు. స్కీం గడువు ముగిసి రెండు నెలలు అవుతున్నా.. రెన్యువల్ చేయకపోవడంతో సుమారు 11 లక్షల మంది కార్మికులకు ప్రమాద బీమా అందని పరిస్థితి నెలకొంది. మరోవైపు గడువుకు ముందు ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు బీమా డబ్బులు కూడా సరిగ్గా రావడంలేదు. బీమా సొమ్ము కోసం బాధిత కుటుంబసభ్యులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. స్కీం అమలులో శాఖల మధ్య సమన్వయలోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 

మార్చిలో ముగిసిన గడువు 

2015లో మేడే సందర్భంగా కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టుల కోసం రూ.5 లక్షల ప్రమాద మరణ బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికింద సుమారు 11 లక్షల మంది డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులు లబ్ధిదారులుగా ఉన్నారు. స్కీం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏటా గడువు ముగియగానే రెన్యువల్ చేస్తున్నారు. చివరిసారిగా 2021లో రెన్యువల్ చేశారు. 2022 మార్చిలో దీని గడువు ముగిసింది. రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటికీ ఎలాంటి రెన్యువల్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో ఈ రెండు నెలల కాలంలో చనిపోయిన వాళ్ల కుటుంబాలకు కూడా ఎలాంటి బీమా పరిహారం అందని పరిస్థితి ఏర్పడింది. అయితే, స్కీం రెన్యువల్ కు సర్కారు నుంచి అనుమతి వస్తే తప్ప తాము ఏమీ చేయలేమని అధికారులు స్పష్టంచేస్తున్నారు.  

ఆఫీసర్ల కొర్రీలు 

ప్రమాదాల్లో మృతి చెందిన వారి డ్రైవింగ్‌‌‌‌ లైసెన్సులు, ప్రమాద వివరాలు, డెత్‌‌‌‌ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లను తీసుకొని ప్రమాద బీమాను అందించాల్సి ఉన్నా అటు రవాణా శాఖ గానీ, ఇటు కార్మిక శాఖ అధికారులు గానీ పట్టించుకోవడంలేదు. బీమా కోసం బాధిత కుటుంబాల సభ్యులు వందల మంది కార్మికశాఖ, రవాణా శాఖ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. ఇక రెండు శాఖల మధ్య సమన్వయం లోపించింది. ఏ శాఖ కూడా తగిన విధంగా స్పందించడంలేదు. మరోవైపు బీమా కోసం అధికారులు అనేక కొర్రీలు పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  

అవగాహన కల్పించట్లే 

స్కీం అమల్లోకి వచ్చి ఐదేండ్లు దాటినా ఇప్పటికీ దీనిపై సరైన అవగాహన కల్పించడంలేదు. చాలా మందికి అసలు ఈ పథకం ఉందన్న విషయమే తెలియదు. దీంతో అనేక కుటుంబాలు లబ్ధి పొందలేకపోతున్నాయి. ఈ స్కీంను  నామమాత్రంగానే అమలు చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి? ఏయే సర్టిఫికెట్లు అవసరం? ఎవర్ని కలవాలి? అనే వాటిపై అవగాహన కల్పించడంలేదని చెప్తున్నాయి. 

కొర్రీలు ఆపి.. అవగాహన కల్పించాలె  

పథకం అమలులో సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. బీమా పొందాలంటే అధికారులు ఎన్నో కొర్రీలు పెడుతున్నారు. ఏడేండ్లు అవుతున్నా స్కీంపై కనీసం అవగాహన కల్పించడం లేదు. దీనిపై సర్కారు దృష్టి సారించాలి. ఎప్పటికప్పుడు బీమా అందేలా చూడాలి.   
- షేక్ సలావుద్దీన్, ప్రెసిడెంట్, క్యాబ్ డ్రైవర్ల జేఏసీ 

వెంటనే స్కీంను రెన్యువల్ చేయాలె 

ప్రమాదంలో చనిపోయినోళ్ల ఫ్యామిలీస్​ను ఆదుకునేందుకు తెచ్చిన సోషల్‌‌‌‌ సెక్యూరిటీ స్కీంను 2 నెలలయినా రెన్యువల్ చేయలేదు. అంతకుముందు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు కూడా బీమా డబ్బులు ఇంకా చెల్లించలేదు. వెంటనే స్కీంను రెన్యువల్ చేయాలి. 
- ఆర్ల సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఆటో డ్రైవర్ల సంఘం