అర్చకులు, ఉద్యోగులకు జీతాలిస్తలె

అర్చకులు, ఉద్యోగులకు  జీతాలిస్తలె
  • దేవాదాయ శాఖలో మూణ్నెళ్లుగా శాలరీలు ఇవ్వని సర్కార్ 
  • 4 నెలలుగా ధూపదీప నైవేద్యం ఖర్చులూ ఇస్తలె  
  • ఈ నిధులను రూ.10 వేలకు పెంచుతూ కేసీఆర్ ప్రకటన.. ఇప్పటికీ రాని జీవో
  • 5,625 మంది రెగ్యులర్ ఉద్యోగుల్లో సగం మందికే పే స్కేల్ 

హైదరాబాద్, వెలుగు : దేవాదాయ శాఖలో పని చేస్తున్న పూజారులు, ఇతర ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ జీతాలివ్వడం లేదు. గుడులకు ధూపదీప నైవేద్యం నిధులను విడుదల చేయడం లేదు. మూణ్నెళ్ల నుంచి జీతాలు, నాలుగు నెలల సంది ధూపదీప నైవేద్యం ఖర్చులు చెల్లించడం లేదు. దీంతో పూజారులు, ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. పిల్లల స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయని, జీతాలు రాకపోవడంతో ఫీజులు కట్టలేకపోతున్నామని వాళ్లు వాపోతున్నారు. సర్కార్ ఎప్పుడూ జీతాలు లేట్​గానే ఇస్తున్నదని, ప్రతిసారీ మూడు నాలుగు నెలల శాలరీలు పెండింగ్​లో పెడ్తున్నదని మండిపడుతున్నారు. చివరకు పోరాడితే ఒక నెల జీతాలు రిలీజ్ చేసి, మళ్లీ మిగతావి ఆపేస్తున్నదని ఫైర్ అవుతున్నారు. ‘‘ప్రభుత్వం ఆరేండ్ల కింద 577 జీవో తీసుకొచ్చింది. ఆలయాల్లోని అర్చక ఉద్యోగులకు మిగతా ఉద్యోగుల్లాగే పే స్కేల్ అమలు చేయాలని,  ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలివ్వాలని అందులో పేర్కొంది. కానీ ఆ జీవో సరిగా అమలు కావడం లేదు” పేర్కొన్నారు. ‘‘ఆలయాల నుంచి సర్కార్ 28 శాతం మేర పన్నులు వసూలు చేస్తున్నది. దాదాపు ఏటా ఆలయాల నుంచి శిస్తుల రూపంలో సర్కారుకు రూ.78 కోట్ల మేర ఆదాయం వస్తున్నది. అయినా అర్చక ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం దారుణం” అని ఆవేదన చెందుతున్నారు. 

పే స్కేల్ అమలులో కొర్రీలు..  

రాష్ట్ర ప్రభుత్వం ఆరేండ్ల కింద 577 జీవో తెచ్చింది. యాదాద్రి, భద్రాద్రి, కొండగట్టు, వేములవాడ సహా పెద్ద గుడులు, శిస్తు కట్టేవి కలిపి 656 ఆలయాల్లోని 5,625 మంది అర్చక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. వీళ్లకు గ్రాంట్​ఇన్​ఎయిడ్​కింద పే స్కేల్​అమలు చేయాలని, ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని జీవోలో పేర్కొంది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని కొర్రీలు పెట్టింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి పని చేస్తున్నోళ్లనే రెగ్యులర్​ఉద్యోగులుగా పరిగణిస్తూ కేవలం 3,200 మందికే పే స్కేల్​అమలు చేస్తున్నది. వీరిలో కరోనా టైంలో 270 మంది మరణించడం, కొందరు రిటైర్​కావడంతో ప్రస్తుతం రెగ్యులర్ బేసిస్ లో పని చేస్తున్నోళ్లు 2,723 మంది మాత్రమే ఉన్నారు. వీళ్లకే గ్రాంట్ ఇన్​ ఎయిడ్ కింద జీతాలు అందుతున్నాయి. మిగతా సగం మందికి పే స్కేల్ అమలు కావడం లేదని అర్చక ఉద్యోగ సంఘం జేఏసీ చెబుతున్నది.  

రూ.10 వేలకు పెంపుపై జీవో ఏది? 

ధూపదీప నైవేద్యం నిధులను కూడా సర్కార్ టైమ్ కు ఇవ్వడం లేదు. మొత్తంగా రాష్ట్రంలోని 6,426 గుడులకు ధూపదీప నైవేద్యం నిధులుఅందాల్సి ఉండగా.. నాలుగు నెలల నుంచి రాష్ట్రంలోని చిన్న గుళ్లకు నిధులు అందడం లేదని పూజారులు అంటున్నారు. 2007లో వైఎస్​రాజశేఖర్​రెడ్డి హయాంలో పురాతన, ప్రాచీన ఆలయాల్లో ధూపదీప నైవేద్యం ఖర్చుల కోసం నెలకు రూ.2,500 ఇచ్చేవారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్​ దాన్ని రూ.6 వేలకు పెంచారు. నెల కింద బ్రాహ్మణ పరిషత్​ ప్రారంభోత్సవం సందర్భంగా ధూపదీప నైవేద్యం నెలనెలా ఇచ్చే నిధులను రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదు. 

ఒకటో తేదీనే జీతాలియ్యాలె.. 

అర్చక ఉద్యోగులకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. గుడులకు ధూపదీప నైవేద్యం ఖర్చులను నాలుగు నెలల నుంచి విడుదల చేయడం లేదు. పిల్లల స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. జీతాలివ్వకపోతే ఫీజులెలా కట్టాలి? ఇంటి ఖర్చులను ఎలా మేనేజ్​చేయాలి? ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలిచ్చేలా ఆరేండ్ల కిందట ఇచ్చిన జీవోను సర్కార్ సరిగా అమలు చేయడం లేదు. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలివ్వాలి. ధూపదీప నైవేద్యం ఖర్చులను రూ.10 వేలకు పెంచుతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. దానికి సంబంధించి వెంటనే జీవో విడుదల చేయాలి.

 - డీవీఆర్​శర్మ, అధ్యక్షుడు, అర్చక ఉద్యోగుల సంఘం జేఏసీ

మూడేండ్ల సంది ఇంతే.. 

కొందరు ఉన్నతాధికారులే ఆలయ అర్చకుల గ్రాంట్ ఇన్ ఎయిడ్‌‌లో కొర్రీలు పెడ్తున్నరు. మూడేండ్ల నుంచి జీతాలు లేట్ చేస్తున్నరు. ప్రతి మూడు నెలలకోసారి శాలరీలు పెండింగ్ పెడ్తున్నరు. అడిగితే ఒక నెలది ఇచ్చి.. రెండు నెలలది ఆపుతున్నరు. 

- దిండిగల్ ఆనంద శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్చక ఉద్యోగుల సంఘం

ఐదో తేదీలోపు ఇయ్యాలె

దేవాదాయ శాఖ మంత్రి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలి. ఎక్కడ లోపం ఉందో తెలుసుకోవాలి. ప్రతి నెల ఐదో తేదీలోపు జీతాలిచ్చేలా చర్యలు తీసుకోవాలి‌‌. 

- జనంపల్లి జయపాల్ రెడ్డి, ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు