- కేటీఆర్ మాటలు నియంతృత్వ పోకడే: ఎమ్మెల్సీ కవిత
- తీరు మార్చుకోకుంటే..బీఆర్ఎస్ ను ఎవరూ కాపాడలేరు
- ట్యాపింగ్ కేసులో గుంటనక్కతో రేవంత్ సర్కార్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: అభ్యర్థి ఎలాంటివాడైనా కేసీఆర్ బొమ్మ చూసి గుడ్డిగా ఓటెయ్యాలని కేటీఆర్ అనడం కరెక్ట్ కాదని, అది రాచరికపు పోకడేనని, ప్రజలు నష్టపోతారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. సోమవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎంఓయూలన్నీ ఫేక్ అని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, విభజన హామీలను బీజేపీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరఫున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్ పై అభ్యర్థులను నిలబెడుతున్నామని, మంచి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈనెల 20 తర్వాత జనంబాట పడతామన్నారు.
గుంటనక్కతో మ్యాచ్ ఫిక్సింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ఎవరిని పిలిచినా వెళ్లాల్సిందేనని, తప్పు చేయనప్పుడు భయమెందుకని కవిత ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ట్యాపింగ్ జరిగింది కాబట్టే పిలుస్తున్నరు. నేను తప్పు చేయకున్నా ఈడీ విచారణకు పోయిన.. ఆయన విచారణకు పోతే తప్పు లేదు. విచారణకు పిలవడమే నేరమని కేటీఆర్ అనడం సరికాదు. రాచరికపు పోకడలు మారకపోతే బీఆర్ఎస్ ను ఎవరూ కాపాడలేరు. కాంగ్రెస్ సర్కార్ ఈ కేసును తేల్చేలా లేదు. గుంటనక్కతో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నరు. ఎన్నికల కోసమే ఈ హడావుడి’’ అని ఆరోపించారు.
కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూలు
సీఎం రేవంత్ రెడ్డి దావోస్, అమెరికా పర్యటనల్లో చేసుకున్న ఒప్పందాలన్నీ బోగస్ అని కవిత విమర్శించారు. ‘‘సీఎం రేవంత్ 30 సార్లు ఢిల్లీ పోయిండు.. కానీ 30 వేల కోట్లు తేలేకపోయారు. కానీ విదేశాల నుంచి లక్షల కోట్లు తెచ్చినమని డబ్బాలు కొట్టుకుంటున్నరు. 67 వేల కోట్లు పెడుతామన్న ‘ఏడీఐజీసీ’ కంపెనీకి వెబ్ సైట్ దిక్కులేదు. 70 వేల కోట్లు అన్న ‘ఇన్ ఫ్రా కీ’ కంపెనీని మొన్న మే నెలలో పెట్టారు. కొన్ని కంపెనీల పెయిడ్ అప్ క్యాపిటల్ పది లక్షలు కూడా లేదు. ఇవన్నీ ఫేక్ ఎంవోయూలు” అని ఆమె పిలుపునిచ్చారు.
సిటీ కాలిపోతుంటే సీఎంకు పట్టింపు లేదా?
‘‘హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. 2022 నుంచి ఇప్పటిదాకా 22 మంది చనిపోయారు. మొన్న నాంపల్లిలో చిన్న పిల్లలు చనిపోతే సీఎం కనీసం పరామర్శించలేదు. పైగా చనిపోయింది బిహార్ వాళ్లు అని లైట్ తీసుకుంటున్నరు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నరు. ఒక్క ఏడాదే 69 హత్యలు, 176 హత్యాయత్నాలు, 166 కిడ్నాప్ లు జరిగాయి. హోంమంత్రిగా ఉన్న సీఎం పీఆర్ స్టంట్లు పక్కన పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు.అంతేగాక, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కవిత మండిపడ్డారు.
గుడ్డిగా ఓటెయ్యకండి..
‘‘ఎన్నికల్లో నిలబడ్డోడు దొడ్డోడా? పొట్టోడా? అని కాదు చూడాల్సింది. వాడు మనకు పనికొస్తడా లేదా అని చూడాలె. రేపు పొద్దున మన ఇంటి ముందర మోరీ పొంగితే వస్తడా, రాడా? స్ట్రీట్ లైట్ పోతే ఏపిస్తడా? అనేది ముఖ్యం. అంతే తప్ప.. వాడు చెడ్డోడైనా సరే కేసీఆర్ బొమ్మ చూసి ఓటెయ్యాలని చెప్పడం మీ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోంది. దయచేసి కులం, మతం, చుట్టం, పైసలు చూడకండి.. అభ్యర్థి మంచితనాన్ని చూసి ఓటెయ్యండి’’ అని కవిత ప్రజలకు పిలుపునిచ్చారు.
