- రాజధాని ధర్మాసుపత్రులకు పేషెంట్ల తాకిడి
- రోజూ వెయ్యి నుంచి రెండువేలకు పైగా ఓపీ
- బయటి రాష్ట్రాల నుంచీ వస్తున్న పేషెంట్లు
- సీజనల్ ఫీవర్లు, డెంగీ, జలుబులు
హైదరాబాద్, వెలుగు:సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్లతో రాష్ట్రం సతమతమవుతోంది. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పేషెంట్లు హైదరాబాద్‌లోని సర్కారీ దవాఖాన్లకు వస్తున్నారు. లోకల్ పేషెంట్లకు కర్నాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వాళ్లు తోడవుతున్నారు. దాంతో సిటీలోని సర్కారీ హాస్పిటళ్లలో ఔట్ పేషెంట్ బ్లాకులన్నీ కిటకిటలాడుతున్నాయి. రోజూ ఉదయం నుంచే రోగులు వందలాదిగా బారులు తీరుతున్నారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఫీవర్ హాస్పిటళ్లలోని ఓపీ బ్లాకులు, ఆవరణాలు పేషెంట్లు, అటెండెంట్లతో కిక్కిరిసి కన్పిస్తున్నాయి. ఒక్కో ఆసుపత్రిలో రోజుకి వెయ్యి నుంచి రెండు వేలకు పైనే ఓపీ కేసులుంటున్నాయి. కరోనా కారణంగా గతేడాది పేషెంట్లే రాలేదని ఉస్మానియా జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ సారి మాత్రం 20 నుంచి 30శాతం డెంగీ కేసులే చూస్తున్నామని చెప్పారు. ఓపీలో సీజనల్ వైరల్ ఫీవర్లతో పాటు నాన్ స్పెసిఫిక్, డెంగీ, రెస్పిరేటరీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. సాధారణంగా జూన్, జులై నుంచి అక్టోబర్, నవంబర్ దాకా సీజనల్ కేసులుంటాయి. గతేడాది పెద్దగా సీజనల్ కేసులు రాలేదని, ఇప్పుడు మాత్రం పూర్తిగా అన్‌లాక్ అవడం, జనం ఇష్టానుసారంగా గుంపులుగా తిరుగుతుండటం, జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు అంటున్నారు. దసరా పండుగ మూడు రోజులు కొంచెం ఓపీ తగ్గినా మళ్లీ పెరిగిందని చెప్తున్నారు.
బస్తీ దవాఖాన్లలో కూడా...
సిటీలో పెద్దాసుప్రతులతో పాటు బస్తీ దవాఖాన్లలో కూడా రోగుల తాకిడి పెరిగింది. చాలాచోట్ల రోజు 600 నుంచి 2,000 దాకా ఓపీ కేసులుంటున్నాయి. ఉస్మానియాలో1,800 నుంచి రెండు వేలు, గాంధీలో 1,100, ఫీవర్ హాస్పిటల్లో 800లు, నిమ్స్ లో 1,800కు పైనే రోజువారీ ఓపీ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో సగానికిపైగా వైరల్ ఫీవర్, డెంగీ కేసులు, ఇతర కాంప్లికేషన్ ఇన్‌ఫెక్షన్లుంటున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం తీవ్రంగా ఉంటే ముందు కరోనా టెస్ట్‌కి పంపి, రిజల్ట్‌ను బట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఎక్కువగా డెంగీయే...
ఉస్మానియాలో ఓపీ రోజూ వెయ్యికిపైనే ఉంటోంది. వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్ కంటే డెంగీ కేసులే ఎక్కువగా వస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- డాక్టర్ రాజేంద్రప్రసాద్ (జనరల్ మెడిసిన్, ఉస్మానియా హాస్పిటల్)
గత నెల నుంచి...
వైరల్ ఫీవర్, డెంగీలతో పాటు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ల కేసులే ఎక్కువగా వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి బాగా పెరుగుతున్నాయి.
- చంద్రశేఖర్ రెడ్డి (ఆర్ఎంఓ, ఫీవర్ హాస్పిటల్)
