రాష్ట్రానికి 2 రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులు

రాష్ట్రానికి 2 రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులు
  • 433 కి.మీ. పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం  
  • గుంటూరు-బీబీ నగర్, ముధ్ఖేడ్-మేడ్చల్ అండ్ మహబూబ్ నగర్-డోన్​ సెక్షన్ల మధ్య డబ్లింగ్ 
  • చెన్నైకి, బెంగళూర్ కు తగ్గనున్న ప్రయాణ దూరం   
  • తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో 7 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా 

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో రెండు రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుంటూరు– బీబీ నగర్, ముధ్ఖేడ్-–మేడ్చల్ అండ్ మహబూబ్ నగర్– డోన్​ సెక్షన్ల మధ్య ఈ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు ప్రాజెక్టుల్లో కలిపి మొత్తం 433.82 కిలోమీటర్ల మేరకు డబ్లింగ్ పనులు చేపట్టేందుకు ఓకే చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కమిటీ (ఆర్థిక వ్యవహరాలు) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం కేబినెట్ కమిటీ నిర్ణయాలను కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. మొత్తం 9 రాష్ట్రాల్లోని 35 జిల్లాలను కవర్ చేసేలా రూ. 32,500 కోట్లతో 7 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఇందులో తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టులకు పూర్తి స్థాయి నిధుల్ని కేంద్రమే అందిస్తోందని వెల్లడించారు. తెలంగాణలో 433.82 కి.మీ., ఏపీలో 374.91 కి.మీ., జార్ఖండ్ లో 201.608 కి.మీ., యూపీలో 190.844 కి.మీ., ఒడిశాలో 184 కి.మీ., బీహార్ లో 139.246 కి.మీ., గుజరాత్ లో 53 కి.మీ., మహారాష్ట్ర లో 49.15 కి.మీ., పశ్చిమ బెంగాల్ లో 40.35 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మల్టీ ట్రాకింగ్ పనులు పూర్తయిన తర్వాత ఆయా రూట్లలో రద్దీ, ప్రయాణ సమయం తగ్గుతాయన్నారు.  

చైన్నైకి 76 కి.మీ. తగ్గుతది 

గుంటూరు– బీబీ నగర్ ప్రాజెక్ట్ లో భాగంగా రూ. 3,238 కోట్లతో 239 కి.మీ. మేర డబ్లింగ్ లైన్ వేయనున్నారు. ఇందులో ఏపీలో100 కి.మీ ఉండగా, తెలంగాణ లోని నల్గొండ, యధాద్రి భువనగిరి మార్గంలో 139 కి.మీ. మేర పనులు సాగనున్నాయి. సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున ఈ మార్గంలో గూడ్స్ రవాణాకు ప్రయోజనం కలగనుంది. ఇండస్ట్రియల్ పరంగా ఏపీలోని జగ్గయ్యపేట సిమెంట్ క్లస్టర్, తెలంగాణలోని జన్ పహాడ్ లోని 13 సిమెంట్ కంపెనీలు, నల్గొండ జిల్లాలోని ఫుడ్ గ్రెయిన్స్, రాబోయే యాదాద్రి థర్మల్ ఫవర్ హౌజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ రూట్ లాభదాయకంగా ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ ప్రాజెక్టుతో చైన్నై– సికింద్రాబాద్ మధ్య 76 కి.మీ., విజయవాడ– సికింద్రాబాద్ మధ్య 38 కి.మీ. ప్రయాణ దూరం తగ్గుతుందన్నారు.   

ఏపీలో మరో ప్రాజెక్టుకూ ఆమోదం 

ఏపీలోని విజయనగరం– ఖుర్దా రోడ్ మీదుగా నెర్గుండి వరకు 3వ రైల్వేలైన్ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కటక్ (నెర్గుండి) నుంచి విశాఖపట్నం (విజయనగరం) మధ్య 3 లైన్ల ద్వారా రైల్వే సామర్థ్యం పెరగనుందని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే సోన్ నగర్ -అండాల్ మధ్య (ఢిల్లీ–-కోల్‌‌‌‌కతా రూట్) 4 వరుసల రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న రెండు లైన్లకు మరో రెండు లైన్లు అదనం కావడంతో తూర్పు, ఈశాన్య భారత్ ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగనుంది.

బెంగళూరుకు 50 కిలో మీటర్లు తగ్గుతది 

ముధ్ఖేడ్-– మేడ్చల్ అండ్ మహబూబ్ నగర్– డోన్​ ప్రాజెక్టులో భాగంగా రూ. 5,655.4 కోట్లతో 418 కి.మీ. మేర డబ్లింగ్ లైన్ వేయనున్నారు. తెలంగాణలో అత్యధికంగా 295 కి.మీ., ఏపీలో 74 కి.మీ., మహారాష్ట్రలో 49 కి.మీ. మేర లైన్ నిర్మించనున్నారు. మన రాష్ట్రంలో నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వనపర్తి, జోగులాంబ, మేడ్చల్ మల్కాజ్ గిరి రూట్లలో ఈ డబ్లింగ్ లైన్ వేయనున్నారు. దీని ద్వారా గొడ్వాడ్, వనపర్తి, వెల్దుర్తి క్వార్ట్జ్ క్వారీల నుంచి ఎగుమతులకు అవకాశం దక్కనుంది. అలాగే మహబూబ్‌‌‌‌నగర్ కాన్ఫెక్షనరీస్ (మిఠాయిలు)ను నార్త్, వెస్టర్న్ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు వీలవుతుంది. ఈ రూట్ ద్వారా రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ లకు దక్షిణాది రాష్ట్రాలకు మధ్య ప్రయాణ సమయం 3 నుంచి 4 గంటలు తగ్గనుంది. రోజూ ఈ రూట్ లో 20 నుంచి 25 ట్రైన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుత రూట్ ప్రకారం సికింద్రాబాద్ వెళ్లి ట్రయాంగిల్ లో ప్రయాణించి ధోనెకు.. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లాల్సి వస్తోంది. కానీ కొత్త మార్గం ద్వారా నేరుగా సికింద్రాబాద్– ధొనె–- బెంగళూరు చేరుకోవడంతో 50 కి.మీ. మేర దూరం తగ్గనుంది. కొత్త డబ్లింగ్ రూట్లు పూర్తయితే వందే భారత్ వంటి రైళ్లకూ ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.