నా కొడుకు సూసైడ్​కు కారణమైన వారికి శిక్ష పడే వరకు పోరాడుతా : వేముల తల్లి రాధిక

నా కొడుకు సూసైడ్​కు కారణమైన వారికి శిక్ష పడే వరకు పోరాడుతా : వేముల తల్లి రాధిక

గచ్చిబౌలి, వెలుగు: తన కొడుకు సూసైడ్​కు కారణమైన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని రోహిత్​ వేముల తల్లి రాధిక వేముల చెప్పారు. హెచ్​సీయూలో సూసైడ్​ చేసుకున్న తన కుమారుడు రోహిత్​ వేముల కేసును క్లోజ్​ చేశారని తెలిసిందని, కొంత మంది పోలీసులు బీజేపీ పార్టీకి అనుకూలంగా విచారణ చేపట్టారని ఆరోపించారు. రోహిత్​ వేముల ఎస్సీ కాదని పోలీసులు హైకోర్టులో రిపోర్టు సబ్​మిట్​​ చేశారని, కానీ రోహిత్​ ముమ్మాటికీ దళితుడే అని చెప్పారు. శనివారం గచ్చిబౌలిలోని హెచ్​సీయూ మెయిన్​ గేట్ వద్ద వర్సిటీ విద్యార్థి సంఘం నాయకులతో కలిసి రాధిక వేముల మీడియాతో మాట్లాడారు. 

పోలీసులు రోహిత్​ కులం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చదవలేక రోహిత్​ చనిపోయాడని పోలీసులు తమ రిపోర్టులో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్​ చదువుల్లో చాలా ముందుండేవాడని,  ఎంఎస్సీలో స్టేట్​6వ ర్యాంకు, జేఆర్ఎఫ్​లో క్వాలిఫై అయ్యాడని తెలిపారు. రోహిత్​ కేసు విచారణ ముగించడంపై సీఎం రేవంత్​రెడ్డిని కలిశామని, కేసు రీ ఓపెన్​ చేసి.. పునర్విచారణ చేస్తామని చెప్పారని వెల్లడించారు. సీఎం సానుకూలంగా స్పందించి, కేసు విచారణను నిష్పక్షపాతంగా జరిపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 

స్టూడెంట్ల మీద పోలీసులు పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని సీఎంను కోరినట్టు చెప్పారు. ఇప్పటి వరకు పోలీసులు తప్పుడు ఎంక్వైరీ చేశారని రాధిక వేముల ఆరోపించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అప్పటి వర్సిటీ వీసీ పొదిలి అప్పారావు, బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, యూనివర్సిటీ ఏబీవీపీ నాయకుడు సుశీల్​కుమార్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఆమె వెంట పలువురు స్టూడెంట్​ యూనియన్​ లీడర్లు ఉన్నారు.