రష్యా రెఫరెండం చెల్లదు: యూఎన్ తీర్మానం

రష్యా రెఫరెండం చెల్లదు: యూఎన్ తీర్మానం
  • ఉక్రెయిన్​లోని 4 ప్రాంతాల విలీనంపై
  • రష్యాకు వ్యతిరేకంగా 143 దేశాల ఓటు
  • ఓటింగ్​కు ఇండియా సహా  35 దేశాలు దూరం

యునైటెడ్ నేషన్స్: ఉక్రెయిన్ లోని 4 ప్రాంతాల్లో రష్యా ఇటీవల నిర్వహించిన రెఫరెండం చెల్లదని ఐక్యరాజ్యసమితి తేల్చిచెప్పింది. రెఫరెండం పేరుతో ఉక్రెయిన్ లోని డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యా విలీనం చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలను, యునైటెడ్ నేషన్స్ చార్టర్స్ ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి మార్పులకు వీల్లేదని, విలీనం చేసుకున్న ప్రాంతాలను రష్యా విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ మేరకు బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా అమెరికా, దాని మిత్ర పక్షాలు సహా 143 దేశాలు ఓటేశాయి. రష్యా, బెలారస్, ఉత్తరకొరియా, సిరియా, నికరాగువా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. అయితే, ఇండియా, చైనా, పాకిస్తాన్ సహా 35 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. 

రష్యాపై చర్యలకు నో ఛాన్స్ 

జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ తో ఒరిగేదేమీ ఉండదని ఎక్స్ పర్ట్ లు అంటున్నారు. దీనికి చట్టబద్ధత లేనందున, రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమయ్యాయని తెలియజేయడం తప్ప ఈ తీర్మానం ద్వారా చర్యలు తీసుకునేందుకు అవకాశం లేదని చెప్తున్నారు. యూఎన్ భద్రతా మండలికి మాత్రమే రష్యాపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం ఉందని, కానీ రష్యా తన వీటో పవర్ తో చర్యలను ఇదివరకే అడ్డుకుందని పేర్కొంటున్నారు.   

పాక్ పై ఇండియా ఫైర్ 

జమ్మూకాశ్మీర్ అంశాన్ని మరోసారి జనరల్ అసెంబ్లీ సెషన్ లో ప్రస్తావించిన పాకిస్తాన్ పై ఇండియా తీవ్రంగా మండిపడింది. రష్యా రెఫరెండాలపై తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో యూఎన్​లో ఇండియా శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ మాట్లాడారు. కాశ్మీర్ లోనూ సంక్షోభం ఉందని, అక్కడి ప్రజలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు కల్పించాలని పాక్ అంబాసిడర్ మునీర్ అక్రమ్ చేసిన కామెంట్లను ఆమె ఖండించారు. తరచూ అబద్ధాలు, పనికిమాలిన మాటలు చెప్తూ ఐక్యరాజ్యసమితి వేదికను పాక్ దుర్వినియోగం చేస్తోందని, దీనిని అంతర్జాతీయ సమాజం మొత్తం వ్యతిరేకించాలని కోరారు. జమ్మూకాశ్మీర్ ఎప్పటికీ ఇండియాలో భాగంగానే ఉంటుందని తేల్చిచెప్పారు. రష్యా రెఫరెండాల తీర్మానంపై ఓటింగ్​కు దూరంగా ఉండటంపై స్పందిస్తూ.. ఉక్రెయిన్, రష్యా వివాదాన్ని దౌత్య విధానాలు, చర్చలతోనే పరిష్కరించుకోవాలన్నది ఇండియా అభిప్రాయమని ఆమె తెలిపారు.