పబ్ జీ ఎఫెక్ట్: యువకుడిని తాళ్లతో కట్టి బంధించిన గ్రామస్థులు

పబ్ జీ ఎఫెక్ట్: యువకుడిని తాళ్లతో కట్టి బంధించిన గ్రామస్థులు

హెల్మెట్ పెట్టుకుని..గొడ్డలి పట్టుకుని తిరుగుతూ యువకుడి హల్ చల్

తాళ్లతో కట్టి బంధించిన గ్రామస్థులు

పబ్​జీ వ్యసనం ఎన్ని అనర్థాలకు దారి తీస్తోందో చెప్పే ఘటన మరొకటి జరిగింది. పబ్జీకి బానిసైన ఓ యువకుడు మూడు రోజులుగా హెల్మెట్​ పెట్టుకుని, గొడ్డలి పట్టుకుని ఊరంతా హల్​చల్​ చేశాడు. అతడి విపరీత చేష్టలకు విసిగిపోయిన ఊరోళ్లు అతడిని తాళ్లతో కట్టి పడేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా నర్సింగాపూర్​ గ్రామంలో జరిగింది. ఊరికి చెందిన అనిల్​ అనే యువకుడు ఫొటోగ్రాఫర్​గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో పబ్​జీ ఆడుతుండేవాడు. అదే వ్యసనంలా మారింది. దీంతో నిజ జీవితంలోనూ గేమ్​ ఆడుతున్నానన్న భావనతో మూడు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నాడు. హెల్మెట్​ పెట్టుకుని షూట్​ చేసి చంపేస్తానంటూ ఇంట్లో కేకలు పెట్టాడు. గురువారం బయట ఆడుకుంటున్న పిల్లలను గదిలో పెట్టి తాళం వేశాడు. చిన్నారుల కేకలతో స్థానికులు తాళం తీసి వాళ్లను బయటకు పంపించారు. అనిల్​కు నచ్చజెప్పారు. పబ్​జీ ఆడుతున్నానన్న మోజులోనే ఇంట్లోని టీవీ, కెమెరా, కంప్యూటర్​లను పగలగొట్టాడు. శుక్రవారం గొడ్డలి పట్టుకుని జనాన్ని భయపెట్టాడు. ఇంట్లోవాళ్లను బయటకు గెంటేసి తలుపులు పెట్టుకుని పబ్​జీ గేమ్​ పేరుతో వస్తువులను చిందర వందరగా పడేశాడు. దీంతో అతడిని తాడుతో కట్టేశారు. కొద్ది రోజులుగా అతడు మత్తు పదార్థాలకు బానిస అయ్యాడని, అందుకే పబ్​జీ గేమ్​ నుంచి బయటకు రాలేక ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. కోర్టు, వైద్యుల అనుమతి తీసుకుని అతడికి ట్రీట్​మెంట్​ చేయిస్తామని పోలీసులు వెల్లడించారు.