- మొదటి స్టేషన్ రెడీ.. 3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం
దుబాయ్: విలాసవంతమైన భవనాలు, అద్భుతమైన నిర్మాణాలకు పేరుగాంచిన దుబాయ్ నగరం, ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన తొలి స్టేషన్(వర్టిపోర్ట్) నిర్మాణ పనులు పూర్తయ్యాయని అక్కడి అధికారులు ప్రకటించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(డీఎక్స్‌బీ) సమీపంలో సుమారు 3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఎయిర్ టాక్సీ స్టేషన్‌ను నిర్మించారు.
అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ భవనంలో ఎయిర్ టాక్సీలు ల్యాండ్ అవ్వడానికి, టేకాఫ్ తీసుకోవడానికి ప్రత్యేక ప్యాడ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన హై-స్పీడ్ చార్జింగ్ పాయింట్లు, ప్రయాణికుల కోసం విలాసవంతమైన ఏసీ లాంజ్‌లు ఏర్పాటు చేశారు.
గంటకు 320 కిలోమీటర్ల వేగం
సాధారణంగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి పామ్ జుమేరా వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే రోడ్డు మార్గంలో ట్రాఫిక్‌ను బట్టి కనీసం 45 నిమిషాల సమయం పడుతుంది. కానీ, ఎయిర్ టాక్సీ ద్వారా ఆ దూరాన్ని కేవలం 10 నుంచి 12 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ టాక్సీలు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనున్నాయి.
అమెరికాకు చెందిన జాబీ ఏవియేషన్సంస్థ రూపొందించిన ఈ టాక్సీలు పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి. ఇందులో పైలట్‌తోపాటు నలుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. హెలికాప్టర్ల మాదిరిగా పెద్దగా శబ్దం చేయకపోవడం వీటి ప్రత్యేకత. 2026 చివరి నాటికి దుబాయ్ మొత్తం నాలుగు కీలక ప్రాంతాల్లో (డౌన్‌టౌన్, మెరీనా, పామ్ జుమేరా, ఎయిర్‌పోర్ట్) ఈ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది.

