నామ్ కే వాస్తే.. సర్కారు దవాఖానలు

నామ్ కే వాస్తే.. సర్కారు దవాఖానలు
  • కొన్నిట్లయితే సూది, దూది, స్పిరిట్​ కూడా దొర్కుతలే
  • ఎమర్జెన్సీ మెడిసిన్స్​, సర్జికల్ కిట్లకు కటకట
  • అప్పోసొప్పో చేసి ప్రైవేట్ల కొంటున్న పేదలు 
  • మందులకు బడ్జెట్​లో ప్రభుత్వ కేటాయింపులు
  • నామ్కేవాస్తే ఏటా కావాల్సింది రూ. 600 కోట్లు.. ప్రభుత్వం ఇస్తున్నది 300 కోట్లే

వెలుగు నెట్​వర్క్: పేదలకు పెద్ద దిక్కయిన ప్రభుత్వాస్పత్రుల్లో ఏ ఒక్క మెడిసిన్​ సక్కగా ఉంటలేదు. కొన్ని దవాఖాన్లలో అయితే కాటన్, స్పిరిట్, సిరంజీ, నీడిల్స్​ను కూడా పేషెంట్లు పైసలు పెట్టి బయటనే కొనుక్కోవాల్సి వస్తున్నది. హైదరాబాద్​లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా సహా వరంగల్​ఎంజీఎంతో పాటు ఆదిలాబాద్​, కరీంనగర్, ఖమ్మం,  మహబూబ్​నగర్, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్​, నిజామాబాద్ తదితర పెద్దాసుపత్రుల్లోనూ కావాల్సినన్ని మందులు అందుబాటులో లేవు. ఔట్​ పేషెంట్లకు బయటే కొనుక్కోవాలని ప్రిస్క్రిప్షన్లు రాసిస్తుండగా.. ఇన్​పేషెంట్లు కూడా బయట నుంచే తెచ్చుకుంటున్నారు. క్రిటికల్ కండిషన్​లో దవాఖానకు వస్తున్నవారిని కూడా మందులు, ఇంజక్షన్లు బయట నుంచి తెచ్చుకోవాలనడంతో అప్పటికప్పుడు డబ్బులు అడ్జస్ట్​ చేసుకోలేక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు.  టీఎస్​ఎంఎస్​ఐడీసీ నుంచి ఇండెంట్​ ప్రకారం నార్మల్​ మెడిసిన్​ సరిపడా రాక,  ఎమర్జెన్సీ మెడిసిన్​ కొనేందుకు డబ్బులు లేక బయటికి రాయక తప్పుతలేదని డాక్టర్లు చెప్తున్నారు. 
ఇండెంట్లలో కోత.. 
సాధారణంగా తెలంగాణ స్టేట్​ మెడికల్​ సర్వీసెస్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ (టీఎస్​ఎంఎస్​ఐడీసీ​) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మెడిసిన్​  కొని జిల్లాల్లోని డ్రగ్​ స్టోర్స్​కు పంపిస్తారు.  అక్కడి నుంచి అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రులకు మెడిసిన్​  సప్లయ్​ చేస్తారు. ఇందుకోసం ఆయా హాస్పిటళ్ల  సూపరింటెండెంట్లు నెల నెలా ఇండెంట్​ పెడతారు. 
ఆయా ఇండెంట్లకు అనుగుణంగా పూర్తిస్థాయిలో మెడిసిన్​ కొనాలంటే సంవత్సరానికి రూ.600 కోట్లు అవసరమని ఆఫీసర్లు చెబుతుండగా, ప్రభుత్వం సగం మాత్రమే కేటాయిస్తోంది. ఏటా జనాభా, రోగులు పెరుగుతున్నా ఆ మేరకు బడ్జెట్​ పెంచడం లేదు. 2018-‌‌‌‌-–19 బడ్జెట్​లో మెడిసిన్​ కోసం రూ.332 కోట్లు కేటాయిస్తే 2019–--20 లో రూ.226 కోట్లు, 2020–21, 2021–22 సంవత్సరాలకు రూ.330 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ ఫండ్స్​ను పూర్తిస్థాయిలో టీఎస్​ఎంఎస్​ఐడీసీ మెడిసిన్​ కొనుగోలుకు వాడుకునే పరిస్థితి లేదు. సర్కారు ఇచ్చే నిధుల్లో  20% ఎమర్జెన్సీ మెడిసిన్​ కొనుగోలుకు ఆయా హాస్పిటల్స్​కు కేటాయించాలి. మిగిలిన 80శాతంలోనే మెడిసిన్​తో పాటు ఎక్విప్​మెంట్​ కొనుగోలు చేయాల్సి రావడంతో ఫండ్స్​ చాలడం లేదు. దీంతో  అన్ని హాస్పిటల్స్​కు మెడిసిన్​ ఇండెంట్​లో కోతపెడుతున్నారు. 2019 నుంచి ఎమర్జెన్సీ మెడిసిన్​ కొనుగోలుకు హాస్పిటల్స్​కు ఫండ్స్​ రిలీజ్ ​చేయడం లేదని సూపరింటెండెంట్లు చెబుతున్నారు. నార్మల్​ మెడిసిన్​ కోటాలో టీఎస్​ఎంఎస్​ఐడీసీ కోత పెడుతుండడం, ఎమర్జెన్సీ మెడిసిన్స్​కు ఫండ్స్​ రాకపోవడంతో సూపరింటెండెంట్లు అత్యవసర మందులతో పాటు సాధారణ మందులనూ ప్రైవేట్​ మెడికల్​ షాపుల్లో ఉద్దెరకు కొంటున్నారు. అనేక హాస్పిటళ్లలో లిమిట్​ మించిపోయి క్రెడిట్​పై ఇచ్చేందుకు ఎవరూ ముందుకురావడం లేదు.  ఉదాహరణకు సంగారెడ్డి లోని పెద్దాసుపత్రికి రూ.కోటి వరకు,  కరీంనగర్​లో రూ.70 లక్షలు, మహబూబ్​నగర్ హాస్పిటల్​​కు రూ.35 లక్షలు, కనాగర్​కర్నూల్ లో దాదాపు రూ.15 లక్షలకు పైగా బకాయిలు రావాల్సిఉంది. దీంతో డాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రాస్తున్నారు.
ఈ మందులు దొర్కుతలే.. 
గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో అత్యవసరంగా వాడాల్సిన ఇంజక్షన్లు సైతం అందుబాటులో లేవు. పురుగుల మందు తాగినవారికి విరుగుడుగా ఇచ్చే ఎట్రోపైన్​ సల్ఫేట్​ 0.6 ఎంజీ, బ్లీడింగ్ ఆపడానికి వాడే ట్రెనగ్జా, మత్తు కోసం ఇచ్చే మందులు , ప్రొపోఫాల్, సర్జరీల టైమ్​లో మత్తు వచ్చేందుకు అనవిన్ తదితర ఇంజక్షన్లు లేవు. వీటిని పేషెంట్లే బయట కొని తెచ్చుకుంటున్నారు. సోర్బిట్రేట్​, ఎకోస్ర్పిన్, క్లోపిడోగ్రెల్, సెరడెస్​, సైమోకెన్​ఫోర్ట్, లైసర్​-డి, రీసాల్వ్, అమోక్సిలిన్, రాంటాక్ లాంటి టాబ్లెట్లు స్టాక్​ లేవు. కళ్ల ఇన్​ఫెక్షన్​తగ్గించే మోక్సిఫ్లోగ్జాసిన్​, అలర్జీ, సైనస్​లకు అవసరమైన నసిలిన్​ స్ర్పేలు, చిన్న పిల్లలకు దగ్గు, జలుబు చేస్తే వాడే అస్కరిల్​సిరప్, అంబ్రోఫిస్ట్​ సిపర్​గానీ, వాంతులు, విరేచనాలైతే వాడే రొటా వ్యాక్సిన్​కూడా లేదు.

డెలివరీ కిట్లూ బయట కొనుడే
మెదక్, నాగర్​కర్నూల్, వరంగల్, పెద్దపల్లి, మహబూబ్​నగర్, నారాయణపేట తదితర హాస్పిటళ్ల​లో డెలివరీ కిట్లు లేవు. సిరంజీలు, అనస్తీషియా ఇంజక్షన్లు, కాటన్​, కొబ్బరి నూనె బాటిల్​, సర్జికల్​ బ్లేడ్లు, గ్లౌజులు, ప్యాడ్లు, సెలైన్ బాటిళ్లు, బేబీ డైపర్లతో కూడిన కిట్లను  తెచ్చుకోవాలని పేషెంట్లకు చిట్టీలు రాసిస్తున్నారు. వెయ్యి రూపాయల కిట్​కు హాస్పిటళ్ల దగ్గరున్న మెడికల్​ షాపుల్లో రూ. 3 వేలు తీసుకుంటున్నారు.
సూది కూడా దిక్కు లేదు
నాగర్​కర్నూల్​ హాస్పిటల్​లో సిరంజీలు, స్పిరిట్ కూడా దిక్కు లేదు. 30 రకాల డ్రగ్స్, ఇంజక్షన్లను సర్కారు సప్లయ్​ చేయడంలేదు. పేషెంట్స్ ఎవరి సూది వాళ్లే తెచ్చుకోవాలని అక్కడి స్టాఫ్​ చెప్తున్నారు. సర్జికల్ ఐటమ్స్​కు కూడా బయటికి రాస్తున్నారు. హాస్పిటల్​కు గవర్నమెంట్​ నుంచి సిరంజీ, నీడిల్స్, ఎలిసా టెస్ట్ కిట్, నెబులైజర్, స్పిరిట్, బ్లడ్ గ్రూపింగ్ సెరా కిట్ సప్లయ్​ నిలిచిపోయింది.
ఎంజీఎంలో 70 రకాల మందుల కొరత
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్​కు రోజూ రెండు వేల మంది ఔట్​ పేషెంట్లు వస్తుంటారు. సుమారు 300 మంది ఇన్​ పేషెంట్లుగా చేరుతుంటారు. ఇంత పెద్ద దవాఖానలో 70 రకాల మందులు, ఇంజక్షన్ల కొరత ఉంది. ఔట్​పేషెంట్లకు రెండు, మూడు రకాల మందులే ఫార్మసీలో ఇస్తున్నారు. మిగతావి బయట కొనుక్కోవాలని చెప్తున్నారు. ఇక్కడ కీళ్ల నొప్పులు, ఈఎన్​టీ సమస్యలకు సంబంధించిన మందుల్లేవు. 

నాలుగు రాస్తే ఒకటే ఇచ్చిండ్రు
నా భార్యకు కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు వస్తుంటే వరంగల్ ఎంజీఎంకు తీసుకొచ్చిన. డాక్టర్ చెక్ చేసి నాలుగు రకాల మందులు రాసిండు. ఒక ట్యాబ్లెట్ ​మాత్రమే ఇచ్చిన ఫార్మసిస్ట్​ మిగతావి బయట కొనుక్కోమని చెప్పిండు. -రామచందర్, నర్సంపేట, వరంగల్
మందులు బయట కొన్న
నాకు జ్వరం, ఆయాసం ఉంటే కామారెడ్డి హాస్పిటల్​కు వచ్చిన. కొన్ని గోలీలే ఇచ్చినరు. మరో రెండు రకాల గోలీలు బయట కొనుక్కోమన్నరు. బయట రూ.96 పెట్టి కొనుక్కున్న. -గడ్డమీది నర్సయ్య, టెక్రియల్, కామారెడ్డి జిల్లా
దగ్గు, సర్ది మందులు లేవట.
మా కొడుకుకు దగ్గు, సర్ది చేసింది. దీంతో దవాఖానాకు తెచ్చిన.  చెక్ చేసిన డాక్టరు కొన్ని మందులు చిట్టీల రాసిచ్చిండు. దవాఖానాలోని షాపులో మందులు లేవంటున్నరు. దీంతో చేసేది లేక బయట మందుల షాపులో కొంటే రూ.170 బిల్లేసిండు. - శిభు, ఖమ్మం 

నా భార్యను డెలివరీకి తెస్తే మందులు బయట కొనిపిచ్చిన్రు 
నా భార్య  సంధ్య ను డెలివరీ కోసం గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో జాయిన్ చేసినం. జాయిన్​ అయిన రోజే  మందులు బయటికి రాస్తే రూ. 1,500 పెట్టి తెచ్చిన. తర్వాత సిజేరియన్​కు కావాల్సిన మందుల కోసం బయటికే రాసిన్రు. మొత్తం కిట్​ను  రూ. 3 వేలు పెట్టి కొన్న.  సర్కార్ దవాఖాన అని వచ్చినం కానీ ఇక్కడ  పైసలు లేనిది ఏ పనీ జరుగతలేదు. ఫ్రీ ట్రీట్​మెంట్​ అని వస్తే డెలివరీ అయ్యేసరికి  సుమారు రూ. 8 వేల దాకా అయినయ్. ఏమన్నా అందామంటే ఎక్కడ ఇబ్బంది పెడ్తరో అని అన్నీ భరించినం. - కలవేన కిరణ్, ముత్తారం, పెద్దపల్లి జిల్లా