14 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నపంచాయతీ కార్యదర్శులు

14 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నపంచాయతీ కార్యదర్శులు
  • పంచాయతీ కార్యదర్శుల ఆవేదన
  • 14 ఏళ్లుగా ఒకేచోట ఉద్యోగం

హైదరాబాద్, వెలుగుపంచాయతీరాజ్‌‌ శాఖలో పెద్దసార్లకే ప్రమోషన్లు దబదబా వచ్చేస్తున్నయ్‌‌. కింది స్థాయి సిబ్బంది మాత్రం ఉన్నకాడనే ఉంటున్నరు. ఏళ్లుగా స్థాయి పెరగక పంచాయతీ కార్యదర్శులు నిరాశగా ఉన్నరు. ఇటీవల కొందరికి వచ్చినా అక్కడ కొత్తోళ్లను తీస్కుంటుండటంతో మళ్లీ పాతకాడికే పోవాల్నేమో అనుకుంటున్నరు.

14 ఏళ్లుగా వెయిటింగ్

రాష్ట్రంలో సుమారు 3 వేల మంది సీనియర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. అర్హత, సీనియారిటీ, పనితీరు ఆధారంగా గ్రేడ్ 4 నుంచి 3, 2, 1కు వీళ్లకు ప్రమోషన్‌‌ ఇవ్వాల్సి ఉంది. కానీ 14 ఏళ్లుగా ఒకే ఊర్లో పని చేస్తున్నరు. ఇదే టైంలో 3 సార్లు పంచాయతీ ఎన్నికలు జరిగి ముగ్గురు సర్పంచ్‌‌లు మారారు. ఇలా ఒకే దగ్గర ఏళ్లుగా పని చేస్తుండటంతో కొన్ని చోట్ల సర్పంచ్‌‌లు, కార్యదర్శుల మధ్య సఖ్యత లేక గొడవలొస్తున్నాయి. పాత సర్పంచ్‌‌లకు సహకరించి తమ దగ్గర ఎందుకు సరిగా పని చేయట్లేదని కొందరు సర్పంచ్‌‌లు ఆరోపిస్తున్నారు. అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నాన్నారని కార్యదర్శుల సంఘం నేతలు అంటున్నారు.

కొత్తగా గ్రూప్‌‌ 2 వాళ్లు..

అడ్‌‌హక్ బేసిస్‌‌లో ఈమధ్య కొందరు గ్రేడ్‌‌1 కార్యదర్శులకు ఎంపీవోలుగా పదోన్నతి వచ్చింది. కానీ గ్రూప్ 2 వాళ్లకు పోస్టింగ్‌‌తో రివర్షన్‌‌కు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇటీవల గ్రూప్ 2 నుంచి ఈవోపీఆర్డీ (ఎక్స్‌‌టెన్షన్ ఆఫీసర్ టు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌‌మెంట్)గా 67 మంది ఎంపికయ్యారు. ఈ పోస్టును ప్రభుత్వం మండల పరిషత్ ఆఫీసర్ (ఎంపీవో) గా మార్చింది. వీళ్లకు ఓ వారంలో పోస్టింగ్ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఐదో జోన్‌‌ వాళ్లకు ఇప్పటికే చాలా సార్లు ప్రమోషన్లు వచ్చాయని, ఆరో జోన్‌‌లోని కార్యదర్శులకు మాత్రం ఒక్క ప్రమోషన్‌‌ కూడా రాలేదని కార్యదర్శుల సంఘం నేతలంటున్నారు.