- ప్రభుత్వ స్టోరేజీ సామర్థ్యం 25.40 లక్షల టన్నులే..
- రాష్ట్రంలో 1.64 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి అంచనా
- కోటి టన్నుల కెపాసిటీ గోదాములు అవసరం
- దిగుబడి పెరుగుతున్నా.. స్టోరేజీపై దృష్టిపెట్టని సర్కారు
- నిల్వ సామర్థ్యాన్ని 64 లక్షల టన్నులకు పెంచాలనేది ప్రతిపాదనకే పరిమితం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గోదాముల కొరత వేధిస్తోంది. వడ్లను సేకరించేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తున్నా.. ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై స్పష్టత రావడం లేదు. ఈ యేడు రికార్డు స్థాయిలో పంట దిగుబడి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్న 1,157 ప్రభుత్వ గోదాముల కెపాసిటీ 25.40 లక్షల టన్నులు మాత్రమే. సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఇవి ఏమాత్రం సరిపోవు. ప్రస్తుత అవసరాలకు కోటి టన్నుల కెపాసిటీ కలిగిన గోడౌన్లు అవసరం. స్టోరేజీల కెపాసిటీని 64 లక్షల టన్నులకు పెంచాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
మిల్లింగ్ కెపాసిటీ తక్కువే
రాష్ట్రంలో 2,476 మిల్లులు ఉన్నాయి. ఇందులో సాధారణ బియ్యం అందించే 1,534 మిల్లులు ఉన్నాయి. వీటికి రోజుకు రెండు షిఫ్టుల్లో 41,166 టన్నుల బియ్యం మిల్లింగ్ చేసే సామర్థ్యం ఉంది. బాయిల్డ్ రైస్ మిల్లులు 942 ఉండగా.. రెండు షిఫ్టుల్లో రోజుకు 72,120 టన్నుల బియ్యం మిల్లింగ్ చేసే సామర్థ్యం ఉంది.
రాష్ట్రంలో దిగుబడి అయ్యే ధాన్యం పరంగా చూస్తే ఇది చాలా తక్కువ అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నరు. గత యాసంగిలో 92 లక్షల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ సేకరించింది. వీటిని మిల్లింగ్ చేస్తే 62.56 లక్షల టన్నుల రైస్ వస్తాయని అంచనాలు ఉన్నాయి. యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్‌గా మార్చడానికి మిల్లులు ఆగకుడా నడిస్తే దాదాపు 3 నెలలు పడుతుంది. అదే రా రైస్ మిల్లింగ్ చేస్తే 5 నెలలు పడుతుంది. రెండు రకాలుగా చేసినా మిల్లర్లు బియ్యం ఇవ్వడానికి మూడు, నాలుగు నెలలకు పైగా పడుతుంది. దీంతో ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువులోగా మిల్లింగ్ కాక ఇబ్బందిగా మారుతోంది. యాసంగి ధాన్యం మిల్లింగ్ ఇప్పటిదాకా పూర్తి కాలేదు. గోదాములు ఇప్పటికే నిండిపోవడం, నిల్వలు ఖాళీ అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో.. వానాకాలం సేకరించే వడ్ల స్టోరేజీ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రికార్డు స్థాయిలో దిగుబడి అంచనా
ఈ వానాకాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 61.94 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. వడ్ల దిగుబడి 1.64 కోట్ల టన్నుల దాకా వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. రైతులు సొంతంగా వాడుకోవడానికి, ప్రైవేటు వ్యాపారులు కొనేది అంతా కలిపి దాదాపు 30 లక్షల టన్నుల ధాన్యం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అవి పోగా 1.34 కోట్ల టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీ కోసం దాదాపు 30 లక్షల టన్నులను ఎఫ్‌సీఐ ద్వారా సేకరిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల ఆహార అవసరాల కోసం కేంద్రం మరో మరో 30 లక్షల టన్నుల వడ్లను సేకరిస్తుంది. గత యాసంగి సీజన్‌లో కేంద్రం 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు అనుమతించింది. ఈ వానాకాలం కూడా అంతే మొత్తంలో పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారం మరో 40 లక్షల టన్నులకు పైగా వడ్ల కొనుగోలుపై క్లారిటీ రావాల్సి ఉంది. అందుకే ఏటా కొనేదానితో పోలిస్తే రెట్టింపు కొనాలని కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి చేస్తోంది. దాదాపు 1.34 కోట్ల టన్నులకు పైగా పంట వస్తుంటే దానికి అనుగుణంగా నిల్వ చేసుకునే ఏర్పాట్లను మాత్రం సర్కారు చేయలేదు.
