తెలంగాణ రాజ్ భవన్ చోరీ కేసులో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?

తెలంగాణ రాజ్ భవన్ చోరీ కేసులో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్‎లో చోరీ జరిగిందని, కీలకమైన హార్డ్ డిస్కులు మాయమైనట్లు వస్తోన్న వార్తలపై పంజాగుట్ట పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రాజ్ భవన్‎లో ఎలాంటి జరగలేదని తెలిపారు. అందులో పని చేసే ఒక ఎంప్లాయ్ తన సిస్టమ్‎లోని హార్డ్ డిస్క్ తీసుకెళ్లాడని వివరించారు. 

అసలేం జరిగిందంటే..?

రాజ్ భవన్‎లో పని చేస్తోన్న ఓ మహిళా ఉద్యోగి తన ఫొటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేశారని 2025, మే 10వ తేదీన  పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళా ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తిని ఆమె సహోద్యోగి శ్రీనివాస్ (45 ఏళ్ళు, ఐటీ హార్డ్‌వేర్) గా గుర్తించిన పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‎కు తరలించారు. అనంతరం శ్రీనివాస్ బెయిల్‎పై విడుదల అయ్యాడు. 

మహిళా ఫొటోలు అసభ్యకరంగా మార్ఫ్ చేసిన కేసులో జైలుకెళ్లిన శ్రీనివాస్‎ను చట్ట ప్రకారం రాజ్ భవన్ సస్పెండ్ చేసింది. దీంతో శ్రీనివాస్ సస్పెన్షన్ సమయంలో రాజ్ భవన్లోని కార్యాలయానికి వచ్చి తన సిస్టమ్‌లోని హార్డ్ డిస్క్ తీసుకెళ్లాడు. సస్పెన్షన్ సమయంలో అనుమతి లేకుండా వచ్చి హార్డ్ డిస్క్ తీసుకెళ్లాడని శ్రీనివాస్‎పై రాజ్ భవన్ ఐటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఐటీ మేనేజర్ ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‎పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించామని పోలీసులు వివరణ ఇచ్చారు. రాజ్ భవన్లో దొంగతనం, కీలకమైన డాక్యుమెంట్లు మాయం అంటూ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రాజ్ భవన్‎లో ఎలాంటి బయట వ్యక్తుల చోరీ జరగలేదని.. అందులో పని చేసే ఒక ఉద్యోగే తన హార్డ్ డిస్క్ తీసుకెళ్లాడని చెప్పారు.