- రాష్ట్రంలో తొలిసారి నాన్ టీచింగ్ స్టాఫ్‌కు ఆన్‌లైన్ బదిలీలు
- వెయ్యి మంది దాకా ఉద్యోగుల మార్పు.. ఉత్తర్వులు జారీ
- సమగ్ర శిక్ష ఏఎస్పీడీగా శ్రీహరి.. ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్‌గా లింగయ్య
హైదరాబాద్, వెలుగు:స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో భారీగా బదిలీలు జరిగాయి. కింది స్థాయి ఆఫీస్ సబార్డినేట్ నుంచి పైస్థాయి అడిషనల్ డైరెక్టర్ వరకు మొత్తం 9 కేటగిరీల్లో బదిలీలు పూర్తయ్యాయి. మొత్తం సుమారు వెయ్యి మంది వరకు నాన్ టీచింగ్ సిబ్బంది, అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగానిర్వహించినట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ప్రకటించారు. విద్యాశాఖలోని పలు కీలక విభాగాలకు కొత్త బాధ్యులనునియమిస్తూ ప్రభుత్వం ఈ మేరకు జీవోలు ఇచ్చింది. ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్‌గా ఉన్న పీవీ శ్రీహరిని సమగ్ర శిక్ష అదనపు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమించారు. స్టేట్ ఆఫీసులో అదనపు డైరెక్టర్ (కో-ఆర్డినేషన్)గా ఉన్న కె. లింగయ్యను టాస్ డైరెక్టర్ గా నియమించారు. ఆయనకే ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మిడ్ డే మీల్స్ సెక్షన్ చూస్తున్న అదనపు డైరెక్టర్ జి. ఉషారాణిని విద్యాశాఖ పరిధిలోని గురుకులాల సొసైటీ సెక్రటరీగా పంపగా, అక్కడ పని చేస్తున్న రమణ కుమార్‌ను మిడ్ డే మీల్స్ అడిషనల్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఎస్ఎస్ ఏఎస్పీడీగా ఉన్న రాధారెడ్డిని గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ డైరెక్టర్‌గా నియమించారు.
జాయింట్ డైరెక్టర్ల బదిలీలు ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు జాయింట్ డైరెక్టర్లకు స్థానచలనం కలిగింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ జేడీగా రాజీవ్ ను బదిలీ చేశారు. ఇప్పటివరకు అక్కడ ఉన్న ఎం.సోమిరెడ్డిని హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ గా నియమించారు. వరంగల్ ఆర్జేడీగా పని చేస్తున్న కె. సత్యనారాయణ రెడ్డిని మోడల్ స్కూల్స్ జేడీగా పంపారు. ఆయనకు అడిషనల్ డైరెక్టర్ (సీ)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. డైరెక్టరేట్‌లో జేడీ (సర్వీసెస్)గా ఉన్న పి. మదన్ మోహన్‌ను సమగ్ర శిక్ష జేడీ-1గా, ఐఏఎస్ఈ ప్రిన్సిపాల్ ఏ. ఉషారాణిని సమగ్ర శిక్ష జేడీ-2గా నియమించారు. సమగ్ర శిక్షలో ఉన్న వెంకట నరసమ్మను జేడీ (సర్వీసెస్)గా, హైదరాబాద్ ఆర్జేడీగా ఉన్న ఇ. విజయలక్ష్మిని వరంగల్ ఆర్జేడీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
హైదరాబాద్ డీఈఓగా యాదయ్య..
డీఈఓల బదిలీల్లో హైదరాబాద్ జిల్లాకు కొత్త బాధ్యుడిని నియమించారు. మంచిర్యాల డీఈఓగా పని చేస్తున్న యాదయ్యను హైదరాబాద్ డీఈఓగా బదిలీ చేశారు. హైదరాబాద్ డీఈఓగా ఉన్న రోహిణిని సంగారెడ్డి జిల్లాకు పంపగా, అక్కడ పని చేస్తున్న వెంకటేశ్వర్లును రంగారెడ్డి జిల్లా డీఈఓగా నియమించారు. వీరితో పాటు టెట్ సెల్ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న పి. రేవతిరెడ్డిని మోడల్ స్కూల్ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జీవో 38 ప్రకారం ఈ బదిలీలు జరిగాయి. అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, డీఈఓలు, డిప్యూటీ ఈఓలు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు ఇలా అన్ని కేటగిరీల్లో బదిలీలు పూర్తి చేశారు. జిల్లాల వారీగా జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లకు డీఈఓలు.. సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లకు ఆర్జేడీలు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ఉన్నతాధికారుల బదిలీలను ప్రభుత్వం డైరెక్టరేట్ స్థాయిలో చేపట్టింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని పకడ్బందీగా పూర్తి చేసిన ఉద్యోగులు, అధికారులను డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందించారు.
