మరియానాలో ట్రీ లైబ్రరీ

మరియానాలో ట్రీ లైబ్రరీ

ఆ చెట్టు దగ్గరకెళ్తే పుల్లటి ఉసిరి కాయలతో పాటు విలువైన పుస్తకాలు కూడా దొరుకుతాయి. ఎందుకంటే అది కేవలం చెట్టు మాత్రమే కాదు. అదొక ట్రీ లైబ్రరీ. అస్సాంలోని  మరియానాలో ఉన్న ఈ పుస్తకాల చెట్టు.. చాలామంది పిల్లలకు ఫేవరెట్ ప్లేస్. 

పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయడం కోసం అస్సాంలోని కొంతమంది ఆడవాళ్లు కలిసి  ఒక వెరైటీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. అదే ట్రీ లైబ్రరీ. అస్సాంలోని మరియానాలో ఉన్న ఈ ట్రీ లైబ్రరీలో సుమారు ఆరొందలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. వాటిలో కామిక్స్, నవలలు, ఆటోబయోగ్రఫీలతో పాటు హిందీ, ఇంగ్లీష్, అస్సామీస్​ భాషల్లో మరెన్నో పుస్తకాలు ఉన్నాయి. మరియానా గ్రామంలో చదువుతున్న పిల్లలు ఎవరైనా ఈ పుస్తకాలను తీసుకెళ్లి చదువుకోవచ్చు.  

పుస్తకాలు అలవాటు చేయాలని..
ఈ ట్రీ లైబ్రరీని అస్సాంలోని జేసీఐ ఫెమినా అనే ఎన్జీఓకు చెందిన కొందరు ఆడవాళ్లు ఏర్పాటుచేశారు. మరియానా గ్రామంలో గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఉన్న పెద్ద ఉసిరి చెట్టుని అందంగా అలంకరించి  దానికి రకరకాల బాక్స్‌‌లు పెట్టారు. ఒక్కో బాక్స్‌‌లో ఒక్కో జానర్‌‌‌‌కు సంబంధించిన పుస్తకాలు ఉంచారు. పుస్తకాలను, పర్యావరణాన్ని  పిల్లలకు  దగ్గర చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ట్రీ లైబ్రరీ ఏర్పాటుచేశామని చెప్తున్నారు వాళ్లు.  

“ప్రతి విషయాన్ని ఇంటర్నెట్‌‌లో సెర్చ్ చేస్తున్న ఈ జనరేషన్ పిల్లలకు పుస్తకాల విలువ పెద్దగా తెలయదు. పుస్తకాలు చదివే అలవాటు పిల్లల్లో పూర్తిగా తగ్గింది. పైగా పుస్తకం చదవాలంటే ఎంతో ఓపిక, శ్రద్ధ అవసరం. పిల్లలకు వాటిని అలవాటు చేయాలనే  ఈ లైబ్రరీ ఏర్పాటుచేశాం. చెట్టు నుంచి పుస్తకాలు తీసుకుని, చెట్టు కిందే కూర్చొని చదవడం ద్వారా పిల్లలు నేచర్‌‌‌‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతారని ఇలా చేశాం. స్కూల్ సబ్జెక్టులతో పాటు  హిస్టరీ, ఫిక్షన్, బయోగ్రఫీలు లాంటివి కూడా చదివితే పిల్లలు అన్ని రంగాల్లో ముందుంటారు. ఈ లైబ్రరీకి 15 వేలు ఖర్చయింది. మేమే స్వయంగా ఈ లైబ్రరీని తయారుచేశాం. ఈ లైబ్రరీని చూసుకునేందుకు ఒక టీచర్‌‌‌‌ను పెట్టాం. ఈ కాన్సెప్ట్ బాగానే సక్సెస్​ అయింది. ఈ ఊళ్లో చదువుకుంటున్న పిల్లలందరూ ఈ లైబ్రరీని వాడుకుంటున్నారు. కొత్త కొత్త పుస్తకాలు కావా లని అడుగుతున్నారు. త్వరలోనే లైబ్రరీలో  మరి కొన్ని బుక్స్ పెడతాం” అని చెప్పుకొచ్చారు వాళ్లు.