రాష్ట్రంలో పశువులకు గడ్డి కొరత!

రాష్ట్రంలో పశువులకు గడ్డి కొరత!

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో పశువులకు గడ్డి కొరత ఏర్పడింది. యాసంగిలో వరి సాగు చేయొద్దని టీఆర్ఎస్​లీడర్లు చెప్పడం, వరి వేస్తే ఉరే అంటూ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడంతో రైతులు సాగు తగ్గించారు. అంతకుముందు యాసంగిలో రాష్ట్రంలో 53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ ఏడాది మాత్రం 34 లక్షల ఎకరాలకు తగ్గించారు. దాదాపు 35 శాతం సాగు పడిపోవడంతో గడ్డి కొరత ఏర్పడుతోంది. వరి కోతలు మొదలైన చోట్ల గడ్డి కోసం పశువులున్న వాళ్లు తండ్లాడుతున్నారు. గడ్డి అమ్ముతారా అంటూ పొలం కోస్తున్న చోటికి వెళ్లి రైతులను అడుగుతున్నారు. ఒక గడ్డి కట్ట రేటు రూ.80 నుంచి రూ.100 వరకు చెబుతున్నారు. గతేడాది వరకు రూ.5 వేలు ఉన్న ట్రాక్టర్​ గడ్డి ధర ఇప్పుడు రూ.8 వేల నుంచి 10 వేలు పలుకుతోంది. ఒకప్పుడు హార్వెస్టర్లతో కోసిన గడ్డి పశువులు తినడానికి పనికిరాదన్న వారే, ఇప్పుడు ఆ గడ్డిని పైసలు పెట్టి కొనుక్కుపోతున్నారు. 

రిటైల్​గా మరింత రేటు

పొలాల్లో పంట పండించిన రైతు దగ్గర రేటు ఎక్కువనుకుంటే పట్టణాలు, నగరాల్లో రీటైల్​గా వరి గడ్డి అమ్మే వ్యాపారులు మరింత పెంచేశారు. మూడు, నాలుగు నెలల క్రితం వరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో రూ.70 చొప్పున కట్ట గడ్డి అమ్మగా, ఇప్పుడు రూ.130కి అమ్ముతున్నారు. ఇక్కడి వ్యాపారులు ఏపీ లోని కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి లారీల్లో గడ్డి తెచ్చి బైపాస్​ రోడ్డులో నిల్వ చేసి రీటైల్ గా అమ్ముతున్నారు. ప్రస్తుతం 400 కట్టలు పట్టే లారీ గడ్డి రూ.50 వేలు చెబుతున్నారు. వానా కాలంలో వరి సాగు చేసినప్పటికీ, పంట కోతల సమయంలో వర్షాలు కురవడంతో చాలా జి  7ధాన్యం, గడ్డి తడిసిపోయాయి. అకాలవర్షాలతో తడిచిన ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోగా, చాలావరకు గడ్డి పాడైపోయింది. దీంతో యాసంగిలో గడ్డికి డిమాండ్​ ఏర్పడింది. డెయిరీ ఫామ్​లు ఉన్నవారు, మూడు నాలుగు గేదెలు సాదుకుంటూ సమీపంలోని పట్టణాల్లో పాలు అమ్ముకునే చిరు వ్యాపారులకు గడ్డి కొరత మరింత ఇబ్బందిగా మారింది. పెరిగిన గడ్డి ధర ప్రకారం పాల రేటు పెంచలేక, రెట్టింపైన వరి గడ్డిని కొనలేక ఇబ్బంది పడుతున్నారు. వెటర్నరీ ఆఫీసర్లు చెబుతున్న ప్రకారం ఒక బర్రెకు రోజూ 25 కేజీల వరకు పచ్చి గడ్డి, 6 కిలోల వరకు ఎండు గడ్డి వేయాల్సి ఉంటుంది. హార్వెస్టర్ల ద్వారా కోసిన గడ్డి పనికిరాదని రైతులు, బర్ల పెంపకందారులు భావిస్తుండడంతో దానికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న లేదా జొన్న చొప్పను ఎండబెట్టి వాడుకోవాలని సూచిస్తున్నారు. పచ్చి గడ్డి కోసం అన్ని జిల్లాల్లో విత్తనాలను అవసరం మేరకు అందుబాటులో ఉంచామని చెబుతున్నారు.

పెరిగిన డిమాండ్​

గతంలో వరిని కూలీలే కొడవళ్లతో కోసి, కట్టలు కట్టి పంట నూర్చేవారు. గడ్డిని మోపులుగా కట్టి పశువుల దాణాగా ఉపయోగించేవారు. పొలం కోసే దగ్గరి నుంచి, గడ్డి కట్టలు వాము వేసేలోగా 10 నుంచి 15 రోజుల సమయం పట్టేది. ఆ గడ్డిని పశువులు ఇష్టంగా తినేవి. తర్వాత కాలంలో వరి కోత యంత్రాలు వచ్చాయి. కొద్ది తేడాతోనే హార్వెస్టర్లు కోసిన గడ్డిని కట్టలు కట్టే యంత్రాలు కూడా వచ్చాయి. అయితే హార్వెస్టర్​ ద్వారా కోసిన గడ్డిని పశువులు ఇష్టంగా తినడం లేదని పొలాల్లోనే వదిలేసేవారు. కొందరు రైతులు గడ్డి ఎండిన తర్వాత, పొలంలోనే నిప్పు పెట్టేవారు. పశువులకు గడ్డి అవసరమై ఎవరైనా కావాలి అంటే, ఉచితంగానే తీసుకెళ్లమని చెప్పేవారు. మూడు నాలుగేళ్ల క్రితం ఈ పరిస్థితి ఉండగా, రెండేళ్ల నుంచి రైతులకు గడ్డి కట్టకు రూ.20 చొప్పున, మరో రూ.20 చొప్పున కూలీలకు ఇచ్చి కట్టలు కట్టించుకొని తీసుకెళ్లేవారు. ఇప్పుడు అదే హార్వెస్టర్లతో కోసిన గడ్డిని రూ.80 చొప్పున రైతుకు, కట్టలు కట్టినందుకు మరో రూ. 20 చెల్లించి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. 

కట్టకు రూ.130 పెడుతున్నా

నాకు నాలుగు బర్రెలున్నాయి. సొంతం గా వ్యవసాయ భూమి లేకపోవడం, వరి గడ్డి నిల్వ చేసుకునే స్థలం లేకపోవడం తో ఎప్పటికప్పుడు బైపాస్​ రోడ్డులో కొను క్కొచ్చుకుంటా. నాలులు నెలల క్రితం వరకు కట్ట గడ్డి రూ.60 నుంచి 70కి అమ్మేవారు. సీఎం కేసీఆర్​వరి వేయొద్దని చెప్పిన తర్వాత గడ్డి రేటు బాగా పెరిగింది. ప్రస్తుతం కట్ట గడ్డిని ఖమ్మం బైపాస్​ రోడ్డులో రూ.130 చొప్పున కొంటున్న. ట్రాక్టర్​గడ్డి రూ.18 వేలు, లారీ గడ్డి రూ.48 వేలు చెప్తున్నారు. 
- మల్లయ్య, పాలవ్యాపారి, ఖమ్మం

ఎండు చొప్పను ఉపయోగించాలి

రైతులకు గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 21 టన్నుల గడ్డి విత్తనాలు సరఫరా చేశాం. ఇప్పటికే 900 ఎకరాల్లో చల్లారు. మా అంచనా మేరకు పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం లేదు. గత ఏడాది 1800 ఎకరాల్లో మొక్కజొన్న సాగులో ఉంటే,  ఇప్పుడు 32 వేల ఎకరాల్లోకి వెళ్లింది. కొంతమంది రైతు లు వరి గడ్డి కావాలని కోరుతున్నారు. పంట సాగు తగ్గడం వల్ల దొరకడం లేదు. గడ్డి రేటు చాలా పెరిగిపోయింది. ఉన్న వరి గడ్డిని మెషిన్ల ద్వారా కోయడంతో పనికి రాకుండా అయిపోయింది. మొక్కజొన్న చొప్పని ఎండపెట్టుకొని వరి గడ్డి స్థానంలో ప్రత్యామ్నాయంగా వాడుకోవాలి. 
- వేణు మనోహర్, వెటర్నరీ జాయింట్ డైరెక్టర్, ఖమ్మం