
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన క్రమంలో.. దొంగల టార్గెట్ గోల్డ్, సిల్వర్ గా మారిపోయినట్లుంది. ఇటీవల నగరంలో జువెలరీ షాపులతో పాటు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. సోమవారం (అక్టోబర్ 06) హైదరాబాద్ చందానగర్ లో దాదాపు 20 లక్షల విలువలైన ఆభరణాల చోరీ ఘటన కలకలం రేపింది.
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఇళ్లల్లో భారీ దొంగతనం జరిగింది. 18 తులాల బంగారం, 60 తులాల వెండి తో పాటు నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. ఇటీవలే ఖజానా జ్యువెలర్స్ తో పాటు పలు దేవాలయాల్లో చోరీ ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇళ్లలను టార్గెట్ చేసి ఆభరణాలను ఎత్తుకెళ్తున్నారు దొంగలు.
లేటెస్టుగా రెండు తాళం వేసిన ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఓల్డ్ MIG లోని సీతారామ్మూర్తి అనే రిటైర్డ్ BHEL ఉద్యోగి ఇంట్లో 18 తులాల బంగారం,60 తులాల వెండితో పాటు కొంత నగదు దొంగిలించారు. సెప్టెంబర్ 29న సత్యసాయిబాబా ట్రస్ట్ దర్శనానికి వెళ్లిన రామ్మూర్తి కుటుంబం.. ఆదివారం (అక్టోబర్ 05) తిరిగి వచ్చి చూసే సరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మియాపూర్ హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో..
మరోవైపు శనివారం (అక్టోబర్ 04) రాత్రి మియాపూర్ లో కూడా దొంగతనం జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ రైల్వే విహార్ లో ఉంటున్నారు. శనివారం రాత్రి 5 తులాల బంగారం, 40 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు హెడ్ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా దొంగతనాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.