- పన్ను సంస్కరణలు లేనట్టే
- ఓపెన్‌లో స్టాక్ మార్కెట్
న్యూఢిల్లీ: ట్రంప్ టారిఫ్‌లు, జియో పొలిటికల్ టెన్షన్లు, కమొడిటీల ధరలు ఇబ్బంది పెడుతున్న వేళ, బడ్జెట్‌లో ఏముంటుందనే ఆసక్తి అందరిలో పెరిగింది. దేశీయ డిమాండ్ బలంగా ఉన్నా, ద్రవ్యోల్బణం కంట్రోల్‌లో ఉన్నా గ్లోబల్ అనిశ్చితులు మాత్రం ఎకానమీని ఇబ్బంది పెడుతున్నాయి. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల విధానాలు ఒకే ట్రెండ్‌లో లేకపోవడం వంటివి కలవరపెడుతున్నాయి. పన్నులు తగ్గించడంతో ప్రభుత్వ ఆదాయం పడిపోయింది.
ద్రవ్యలోటును కంట్రోల్‌లో ఉంచుతూనే ఉద్యోగాలను కల్పించడం, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను పెంచడం, గ్రోత్‌ను ముందుండి నడిపించే కొత్త మార్గాలను కనుగొనడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందున్న పెద్ద సవాల్. డొమెస్టిక్, ఫారిన్ పెట్టుబడులను ఆకర్షించేందుకు రూల్స్, రెగ్యులేషన్స్‌ను ఆమె సులభతరం చేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఆదాయ పన్ను సవరణలు, జీఎస్‌టీ తగ్గింపు, మౌలిక వసతులపై ఖర్చులు పెంచడం, ఆర్‌బీఐ వడ్డీ రేటు తగ్గింపులు వంటి వివిధ చర్యలను కేంద్రం తీసుకుంది. వీటికి మద్ధతుగా మరిన్ని చర్యలను బడ్జెట్‌లో చూడొచ్చు.
ఇవి ఉండొచ్చు..
క్యాపెక్స్: రోడ్లు, రైల్వేలు, డిఫెన్స్, పట్టణ మౌలిక వసతులు, పునరుత్పాదక శక్తి, పవర్ ట్రాన్స్‌మిషన్‌పై పెట్టుబడులు కొనసాగనున్నాయి. 2026–27లో క్యాపెక్స్ రూ.12 లక్షల కోట్లకు చేరొచ్చని ఎస్‌బీఐ అంచనా వేసింది. ఇది కిందటేడాది బడ్జెట్‌తో పోలిస్తే 10 శాతం ఎక్కువ.
పన్నులు: పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ఉంటే పర్సనల్ ట్యాక్స్‌లలో చిన్న సవరణలు ఉండొచ్చు. కార్పొరేట్ పన్ను స్థిరంగా ఉంటుంది. ఇన్వెస్టర్లు ఎస్‌టీటీ రద్దు చేయాలని, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపులను పెంచాలని కోరుతున్నారు.
ఉద్యోగాలు, ఎంఎస్‌ఎంఈ: శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌లకు ప్రోత్సాహకాలు, లేబర్ ఎక్కువగా అవసరం ఉండే సెక్టార్లకు రాయితీలు ఇవ్వడం ద్వారా ఉద్యోగాలను కల్పించడానికి బడ్జెట్‌లో ఫోకస్ పెట్టనుంది. అమెరికా టారిఫ్‌లతో ఎంఎస్‌ఎంఈ సెక్టార్, ఎగుమతిదారులు నష్టపోతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రత్యేక కేటాయింపులు జరగొచ్చు. ఎంఎస్‌ఎంఈలకు ఇస్తున్న క్రెడిట్ గ్యారంటీ మద్దతు కొనసాగే అవకాశం ఉంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్‌లో సవరణలు ఉంటాయని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
గ్రీన్ ఎనర్జీ: పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీపై ఈసారి బడ్జెట్‌లో ఫోకస్ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించడానికి రూల్స్ సులభతరం చేయొచ్చు.
రాజకీయ సంకేతాలు: ఎన్నికల రాష్ట్రాలకు స్కీమ్‌లు, సంక్షేమ పథకాల కేటాయింపులు కొనసాగుతాయి.
ఈ నెంబర్లు గుర్తుంచుకోండి..
ఆర్థిక లోటు: ఇండియా ఆర్థిక లోటు (ఖర్చులు మైనస్ ఆదాయం) 2025-–26లో జీడీపీలో 4.4శాతంగా ఉంటుందని గత బడ్జెట్‌లో ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. 2026-–27కి గాను 4శాతం టార్గెట్ ఉండొచ్చని భావిస్తున్నారు.
క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్: 2025–-26లో ఇది రూ.11.2 లక్షల కోట్లు ఉంది. 2026–-27లో 10–-15శాతం పెరుగుదలతో రూ.12 లక్షల కోట్లకు చేరనుంది.
డెట్ రోడ్ మ్యాప్: 2026-–27 నుంచి కేంద్ర ప్రభుత్వ అప్పు (డెట్) జీడీపీలో తగ్గేలా చర్యలు ఉండనున్నాయి. 2024లో జనరల్ గవర్నమెంట్ (రాష్ట్రాలు+ కేంద్రం) అప్పు- జీడీపీలో 85శాతంగా ఉంది. ఇందులో కేంద్రం అప్పుల వాటా 57 శాతం.
బారోయింగ్స్: 2025-–26లో రూ.14.8 లక్షల కోట్ల అప్పు చేయాలని కిందటి బడ్జెట్‌లో కేంద్రం టార్గెట్ పెట్టుకుంది.
పన్ను ఆదాయం: 2025-–26లో రూ.42.7 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని అంచనా. ఇందులో ప్రత్యక్ష పన్నులు వాటా రూ.25.2 లక్షల కోట్లుగా, పరోక్ష పన్నుల వాటా రూ.17.5 లక్షల కోట్లుగా ఉండనుంది.
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ): 2025–-26లో జీఎస్‌టీ వసూళ్లు ఏడాది లెక్కన 11 శాతం పెరిగి రూ.11.78 లక్షల కోట్లకు చేరతాయని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. రేట్ల తగ్గింపు ప్రభావం వలన 2026-–27లో జీఎస్‌టీ వసూళ్లలో పెద్ద మార్పులు కనిపించనున్నాయి.
నామినల్ జీడీపీ: 2025-–26లో నామినల్ జీడీపీ గ్రోత్‌ను 8శాతానికి ప్రభుత్వం సవరించింది. 2026–-27లో ఇది 10.5-11శాతం ఉండొచ్చని అంచనా.
సిగరెట్లు, పొగాకుపై పెరగనున్న పన్ను
సిగరెట్లు, పొగాకు, పాన్ మసాలాలపై కఠినమైన పన్ను విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది. 28శాతం జీఎస్‌టీ సెస్ స్థానంలో 40శాతం జీఎస్‌టీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక ఆరో గ్య- జాతీయ భద్రతా సెస్ అమలవు తుంది. ఈ సిన్ గూడ్స్‌పై పన్నులు లెక్కించేటప్పుడు తయారీదా రులు వేసిన ఎంఆర్‌పీ రేటును పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్సైజ్ డ్యూటీ కూడా సిగరెట్ల పొడవు ఆధారంగా ఉంటుంది. ఎంఆర్‌పీల ఆధారంగా పొగాకుపై 82శాతం, గుట్కా 91శాతం, పాన్ మసాలాపై 88శాతం ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది.
ఆదివారమైనా మార్కెట్ ఓపెనే
స్టాక్ ఎక్స్చేంజ్‌లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు ఆదివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించను న్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2026–27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా మార్కెట్లు సాధారణ సమయాల్లో (ఉదయం 9:15–మధ్యాహ్నం 3:30) ఓపెన్‌లో ఉంటాయి. ప్రీ-మార్కెట్ 9:00–9:08 మధ్య ఉంటుంది.
