- నిత్య హోమాలు, గోదావరి హారతితో భక్తుల తన్మయత్వం
- వారాంతం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ
జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలు మూడో రోజు వైభవంగా కొనసాగాయి. నిత్య హోమాలు, గోదావరి హారతితో భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. వారాంతం కావడంతో తెల్లవారుజాము నుంచే కాళేశ్వరానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. త్రివేణి సంగమానికి చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించారు.
దీంతో గోదావరి తీరం, కాళేశ్వర క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది. శనివారం పుష్కర స్నానానికి మహా మండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతీ మహారాజ్ పీఠాధిపతి హాజరై తెల్లవారుజామున పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. స్వామి ఆధ్యాత్మిక సందేశం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక బస్టాండ్ నుంచి భక్తులకు ఉచిత షటిల్ సర్వీస్ బస్సులను ఏర్పాటు చేసి ఘాట్లకు సులభంగా చేరుకునేలా చర్యలు చేపట్టారు. ఘాట్ల నుంచి దేవస్థానానికి చేరుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. స్వామివారి కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అనునిత్యం నిర్వహిస్తున్న నవరత్నమాల హారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
