మా రాష్ట్రానికి వస్తే మోడీని చంపేస్తాం.. వార్నింగ్ లెటర్ పై హైలెవల్ ఎంక్వైరీ

మా రాష్ట్రానికి వస్తే మోడీని చంపేస్తాం.. వార్నింగ్ లెటర్ పై హైలెవల్ ఎంక్వైరీ

ప్రధాని మోడీని చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు లేఖ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఏప్రిల్ 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో పర్యటించబోతున్నారు. అయితే తమ రాష్ట్రానికి మోడీ వస్తే ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామంటూ  కేరళ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి దుండగులు మలయాళంలో లేఖ రాశారు. ఎర్నాకులం వాసి జానీ నడుముత్తమిల్ పేరుతో ఈ లేఖ రావడం గమనార్హం. 

మోడీకి బెదిరింపు లేఖ రావడంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ లేఖలో పేరున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అయితే మోడీకి తన పేరుతో ఎవరో పంపారని తాను మాత్రం ఎలాంటి లేఖ రాయలేదని సదరు వ్యక్తి స్పష్టం చేశాడు. ఈ క్రమంలో లేఖపై మిస్టరీ వీడలేదు.ఈ లేఖ ఏప్రిల్ 17వ తేదీనే కేరళ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరిందని పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ లేఖను పోలీసు ముఖ్య అధికారికి.. కేరళ బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కే సురేంద్రన్ తెలిపారు.  ఏప్రిల్​ 24 నుంచి ప్రధాని మోడీ రెండు రోజుల పాటు కేరళలో పర్యటింనున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా బీజేపీ యువజన సంఘాలు నిర్వహించే ‘యువం’ అనే సమావేశంలోనూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మోడీకి బెదిరింపు లేఖ రావడంపై స్థానికంగా కలకలం రేపుతోంది.

మోడీ కేరళ టూర్..

ప్రధాని మోడీ ఏప్రిల్ 24వ తేదీన కొచ్చికి చేరుకుంటారు. అక్కడ రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం యూత్ మీటింగ్‌కు హాజరవుతారు.  9 కీలక చర్చ్‌ల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఏప్రిల్ 25న తిరువనంతపురం చేరుకోనున్న మోడీ..వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సెంట్రల్ స్టేడియం నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా గుజరాత్‌కు వెళ్తారు.