తెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     అభివృద్ధికి రహదారుల అనుసంధానం కీలకం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి
  •     రూ.87 కోట్ల సీఆర్ఎఫ్ పనులకు శంకుస్థాపన

ఇబ్రహీంపట్నం, వెలుగు: తెలంగాణకు ప్రతిపాదించిన మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి గేమ్ ఛేంజర్‌‌‌‌గా మారనున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో రూ.87 కోట్ల విలువైన సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్​ఎఫ్​) రోడ్డు పనులకు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్-పూణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. 

ఈ హైస్పీడ్ కారిడార్ల ప్రాథమిక అంచనా వ్యయం రూ.5 లక్షల కోట్లు కాగా, భూసేకరణ వ్యయాలతో ఇది రూ.10 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నాయని, డీపీఆర్ పూర్తి కాగానే టెండర్లు పిలిచి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. తిమ్మాపూర్ గ్రామ రోడ్డు అనుసంధానానికి కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసిందని, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

రహదారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి కోమటిరెడ్డి

గ్రామాల అభివృద్ధికి రహదారుల అనుసంధానం కీలకమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషితో రూ.100 కోట్ల పనులు మంజూరయ్యాయని చెప్పారు. గతంలో కాంట్రాక్టర్లకు బిల్లులు అందక కొన్ని పనులు ఆలస్యమైనా, ఇకపై ఆ పరిస్థితి రానివ్వబోమని స్పష్టం చేశారు. కొంగర, రావిర్యాల, తిమ్మాపూర్ తదితర ప్రాంతాల రహదారి నిర్మాణ పనులను సమీక్షించి, రాబోయే కొద్ది నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఆర్ అండ్ బీ చైర్మన్ మల్‌‌‌‌రెడ్డి రాంరెడ్డి, ఎమ్మెల్యే మల్‌‌‌‌రెడ్డి రంగారెడ్డి  పాల్గొన్నారు.