అప్పుల బాధతో.. ముగ్గురు అన్నదాతల ఆత్మహత్య

అప్పుల బాధతో.. ముగ్గురు అన్నదాతల ఆత్మహత్య
  • అప్పుల బాధతో పురుగుల మందు తాగి సూసైడ్
  • పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో ఘటనలు

అప్పుల బాధతో రాష్ట్రంలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  పెద్దపల్లి, హన్మకొండ, జయశంకర్ భూపాల పల్లి జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. పంట దిగుబడి సరిగా రాక, వర్షాలకు పంట కొట్టుకుపోయి ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ముత్తారం, మొగుళ్లపల్లి (టేకుమట్ల), పరకాల, వెలుగు: రాష్ట్రంలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అప్పులు ఎక్కువై.. కుటుంబ పోషణ భారమై.. 
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన పరికిపండ్ల రమేశ్ (40) తనకున్న 3 ఎకరాలతోపాటు 2 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. 3 ఏండ్లుగా పంటలు సరిగా పండక దిగుబడి రావడం లేదు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చడానికి దారిలేక ఒకవైపు.. కుటుంబ పోషణ భారమై మరోవైపు ఆందోళన చెందాడు. బుధవారం రాత్రి 9 గంటలకు పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రమేశ్.. అక్కడే పురుగుల మందు తాగాడు. 9.30కి తన భార్య పద్మకు ఫోన్ చేసి..
తాను పురుగుల మందు తాగినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రమేశ్‌‌‌‌ను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం చనిపోయాడు.
పంట కొట్టుకుపోయి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గుమ్మడవల్లికి చెందిన అకినపల్లి సారయ్య(45) తనకున్న వ్యవసాయ భూమిలో గత ఏడాది వరి సాగు చేశాడు. భారీగా కురిసిన వానలకు చలి వాగు ఉధృతంగా ప్రవహించడంతో పంట పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఏడాది వరి సాగు చేసినా అదే దుస్థితి. ఇటీవల పంటకు సాగునీరు కోసం బోర్ వేశాడు. కానీ నీళ్లు పడలేదు. రూ.4 లక్షలు అప్పు మాత్రం మిగిలింది. అంత మొత్తం తీర్చే దారిలేక బుధవారం అర్ధరాత్రి పంట చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.

6 లక్షల అప్పు తీర్చలేక
హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి పల్లబోయిన సురేశ్‌‌‌‌(40)కు ఎకరన్నర భూమి ఉంది. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సొంత పొలంలో మిర్చి, కౌలుకు తీసుకున్న భూమిలో వరి వేశాడు. మిర్చి పంటకు వైరస్ సోకడంతో మొక్కలన్నీ చనిపోయాయి. వరి దిగుబడి పెద్దగా రాలేదు. దీంతో తాను తెచ్చిన అప్పులు ఏలా చెల్లించాలో తెలియక ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సురేశ్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పరకాల తహసీల్దార్ జగన్ మోహన్​రెడ్డి గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సురేశ్ ఫ్యామిలీ వివరాలు సేకరించారు.